Deccan Queen train
-
డెక్కన్ క్వీన్‌కు కొత్త లుక్
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై, పుణే నగరాల మధ్య నడిచే డెక్కన్ క్వీన్ రైలు కొత్త సొబగులతో ప్రయాణికులను అలరించనుంది. పారదర్శక విస్టాడోం కోచ్‌లతో పరుగులు తీయనుంది. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త రూపుతో డెక్కన్ క్వీన్ పరుగులు తీసేలా సుముహూర్తం ఖరారైంది. ఇటీవల డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏర్పాటుచేసిన పారదర్శక విస్టాడోం కోచ్‌లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులకు మరో కానుక అందజేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ముంబై, పుణేల మధ్య నడిచే డెక్కన్ క్వీన్‌కు కూడా పారదర్శక విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేయాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు పంద్రాగస్టు నుంచి డెక్కన్ క్వీన్ రైలు సాధారణ కోచ్‌లకు బదులుగా విస్టాడోం కోచ్‌లతో పరుగులు తీయనుంది. ముంబై, పుణే నగరాల మధ్య అప్పటివరకు సాధారణ బోగీలతో నడిచిన డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేసి, జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ కోచ్‌ల పైకప్పు, ఇరువైపులా అద్దాలతో కూడిన పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. దీంతో రైలులో ప్రయాణిస్తుండగానే ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా కర్జత్–ఖండాలా–లోణావాలాల మధ్య ఘాట్ సెక్షన్ ఉంది. అక్కడ ఎటు చూసిన పచ్చని ప్రదేశం, అనేక కొండలు, సొరంగాలు, కొండల పైనుంచి పారుతున్న జలపాతాలు ఇలా అనేక అందాలను తిలకించవచ్చు. ఈ ప్రాంతాల మీదుగా రైలు వెళుతుండగా ఇరుదిక్కుల నుంచి తిలకించే ప్రకృతి అందాలు మైమరింపజేస్తాయి. ఈ రైలు ప్రారంభించిన నాటి నుంచి ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకు ఖాళీగా తిరిగిన ఈ రైలు పర్యాటకులు, ప్రయాణికుల వల్ల రైల్వేకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో ఇదే తరహాలో డెక్కన్ క్వీన్ రైలుకు కూడా విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే సంకల్పించింది. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీన విస్టాడోంలతో కూడిన డెక్కన్ క్వీన్ రైలు నంబర్ 02124 పుణే నుంచి ఉదయం 7.15 గంటలకు బయలుదేరి ముంబై సీఎస్ఎంటీకి ఉదయం 10.25 గంటలకు చేరుకుంటుంది. రైలు నంబర్ 02123 ముంబై సీఎస్ఎంటీ నుంచి సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి రాత్రి 8.25 గంటలకు పుణే చేరుకుంటుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి ఈ కొత్త డెక్కన్ క్వీన్ రిజర్వేషన్ల బుకింగ్ ప్రారంభమైందని రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా విస్టాడోం కోచ్‌లతో కూడిన డెక్కన్ క్వీన్ రైలుకు నాలుగు ఏసీ చెయిర్ కార్లు, తొమ్మిది సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు, మరో రెండు సామాన్య సిట్టింగ్‌తో పాటు గార్డు, బ్రేక్ వ్యాన్, ఒక ప్యాంట్రీ కారు ఉన్నాయి. ఇందులో టికెటు కన్ఫర్మ్ అయినవారినే అనుమతించనున్నారు. పర్యాటకుల కు, నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు స్టేషన్లో ప్రవేశించక ముందే థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష లు నిర్వహిస్తారు. కోవిడ్ నియమాలకు కట్టుబడి ఉంటేనే రైల్వే ప్లాట్‌ఫారంపైకి అనుమతిస్తామని రైల్వే అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
పంజాబ్ మెయిల్ 107 డెక్కన్ క్వీన్ 90
ముంబై: మన దేశంలోనే అత్యంత దూరం నడిచే ఆ పాత రైలు బండి పంజాబ్ మెయిల్. ఆ రైలు జూన్ 1తో 107 ఏళ్లను పూర్తి చేసుకుంది. ముంబై నుంచి పుణెకు నడిచే డెక్కన్ క్వీన్ 89 ఏళ్లు పూర్తి చేసుకుంది. పంజాబ్ మెయిల్ ఆవిరితో నడిచే రైలు. ముంబై నుంచి పెషావర్ (ప్రస్తుతం పాక్‌లో ఉంది) వరకు నడిచింది. ఈ రైలు సర్వీసు మొదట్లో బ్రిటిషర్ల కోసమే ఉండేది. తర్వాత దిగువ తరగతి వారికీ అందుబాటులోకొచ్చింది. 1930లో ఈ రైలుకి మూడో తరగతి బోగీలను అమర్చారు. 1945లో ఏసీ సౌకర్యం వచ్చింది. ప్రస్తుతం ఈ రైలు విద్యుత్‌పైనే నడుస్తోంది. దేశ విభజనకు ముందు పంజాబ్ మెయిల్ ముంబై నుంచి పెషావర్ వరకు 2,496 కి.మీ. దూరం 47 గంటల్లో వెళ్లేదని సెంట్రల్ రైల్వేకు చెందిన చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సునీల్ చెప్పారు. బ్రిటీష్ ఇండియాలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలు ఇదే. ప్రస్తుతం ఈ రైలు ఫిరోజ్‌పూర్ వరకు నడుస్తోంది. అప్పట్లోనే పంజాబ్ మెయిల్లో బాత్రూమ్, రెస్టారెంట్ కార్, లగేజ్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ ఉండేవి. ఆరు బోగీలు ఉండే మెయిల్లో 3 ప్రయాణికుల కోసం కేటాయిస్తే మిగతావి ఉత్తరాల రవాణాకు వాడారు. ఈ 3 బోగీల్లో కేవలం 96 మంది ప్రయాణించే వీలుండేది. ఇక డెక్కన్ క్వీన్ రైలు 1930జనవరి 1న ప్రారంభమైంది. పుణె నుంచి ముంబై వరకు నడిచిన ఈ రైలు దేశంలో తొలి డీలక్స్ రైలు. ఈ డెక్కన్ క్వీన్ ఠంచనుగా షెడ్యూల్ టైమ్‌కు నడిచేది. అందుకే ఈ రైల్లో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించేవారని సునీల్ వివరించారు. -
ఘనంగా ‘క్వీన్’ జన్మదినోత్సవం
సాక్షి, ముంబై: పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే ముంబై-పుణే ‘డెక్కన్ క్వీన్’ రైలు 85వ పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా నిృ్వహించారు. ప్రయాణికులు ఏటా క్రమం తప్పకుండా ఈ రైలుకు జన్మదినోత్సవం నిర్వహించడంవల్ల డెక్కన్క్వీన్కు ఆదరణ పెరుగుతూనే ఉంది. దీని పుట్టిన రోజు సందర్భంగా బోగీలను రంగురంగుల కాగితాలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. శనివారం ఈ రైలు విధులు నిర్వహించిన మోటార్‌మన్ (డ్రైవర్) గార్డుకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల వ్యయాన్ని రైలులో శనివారం రాకపోకలు సాగించిన ఉద్యోగులే భరించారు. 1930 నుంచీ సేవలు.. బ్రిటిష్‌పాలనలో ముంబై-పుణే నగరాల మధ్య మొట్టమొదటిసారిగా 1930 జూన్ ఒకటిన డెక్కన్ క్వీన్ అనే పేరుతో ఈ రైలును ప్రారంభించారు. అప్పట్లో బ్రిటిష్ రాణులు, వారి బంధువులు ఇందులో రాకపోకలు సాగించేవారిని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా ఈ రెండు నగరాల మధ్య ఉద్యోగులు, వ్యాపారుల రాకపోకలు పెరిగిపోవడంతో అందరూ ఈ రైలునే ఆశ్రయించడం మొదలయింది. అతి తక్కువ సమయంలోనే దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలకు ఈ రైలు అనువుగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఉదయం ముంబైకి రావడం, సాయంత్రం పుణేకు ఇది తిరుగు ప్రయాణ మవుతుంది. ఇందులో తరచూ ప్రయాణించే వాళ్లంతా కుటుంబ సభ్యుల్లా కలసిమెలసి ఉంటారు. పుణే-ముంబై మధ్య ప్రత్యేకంగా ప్రతీరోజు డెక్కన్ క్వీన్, ప్రగతి ఎక్స్‌ప్రెస్, సింహగఢ్, ఇంటర్సిటీ ఇలా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతాయి. ఇవన్నీ ఉదయం ముంబై వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడతాయి. ఉద్యోగులకు డెక్కన్ క్వీన్ రైలు టైం టేబుల్ అనుకూలంగా ఉండడం వల్ల అత్యధికులు దీనినే ఆశ్రయిస్తారు. డెక్కన్ క్వీన్ ఇంజన్ మొదలుకుని బోగీలు సైతం నీలం రంగులో ఉంటాయి. కిటికీలపైన తెల్లని రంగుతో పట్టీ కనిపిస్తుంది. ఎంతో ప్రజాదరణ పొందిన దేశభక్తి గీతం ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ అనే పాటలో ఒక చోట నీలం రంగుతో కనిపిస్తున్న రైలు కూడా ఇదే కావడం విశేషం. ఈ 85 ఏళ్లలో డెక్కన్ క్వీన్‌ను నిత్యం వినియోగించుకున్న ఎందరో ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. భారత రైల్వే చరిత్రలో ఒకప్పుడు రైళ్లకు వేర్వేరు రంగులు ఉండేవి. అన్నీ ఒకేవిధంగా కనిపించాలనే ఉద్దేశంతో (ఇటీవల వచ్చిన దురంతో రైళ్లు మినహా) రైళ్లన్నింటికీ ఒకే రంగు వేశారు. డెక్కన్ క్వీన్ రైలు రంగు మాత్రం అలాగే ఉంది. దీని ఇంజన్ కూడా నీలం రంగులోనే ఉంటుంది. ఈ రైలుకు ఐదు ఏసీ చైర్‌కార్ బోగీలతోపాటు సీజన్పాస్ హోల్డర్ల కోసం ప్రత్యేకంగా బోగీలు కేటాయించారు. డైనింగ్ కార్ బోగీ కూడా ఉంది. ఇందులో ఒకసారి 32 మంది ప్రయాణికులు కూర్చుని అల్పాహారం, టీ, శీతల పానియాలు సేవించవ చ్చు.