డీఈసీఈ.. ఇంటర్‌తో సమానమే!
ఎల్ఐసీ, మహిళా ఉద్యోగి వివాదంలో హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆంధ్రా, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించిన మూడేళ్ల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమో(డీఈసీఈ) కోర్సు రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సుతో సమానం కాదన్న జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) వాదనలను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. రెండు అత్యున్నత విద్యా సంస్థలు డీఈసీఈ డిప్లొమో కోర్సును ఇంటర్ తత్సమాన కోర్సుగా గుర్తించినప్పుడు, ఎల్ఐసీ అందుకు విరుద్ధమైన వైఖరిని తీసుకోవడం అర్థం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
డీఈసీఈ డిప్లొమో చేసిన ఓ మహిళకు అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చి, ఆ తరువాత డీఈసీఈ డిప్లొమో ఇంటర్ తత్సమాన కోర్సు కాదంటూ ఆమెను ఉద్యోగంలోని నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ బి.శివశంకరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.