99 శాతం తగ్గిన కెయిర్న్ ఇండియా లాభం
► చమురు ధరల పతనం,
► అధిక పన్నుల ప్రభావం
న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 99 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.1,350 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.9 కోట్లకు తగ్గిందని కెయిర్న్ ఇండియా తెలిపింది. ముడి చమురు ధరలు తగ్గడం, అధిక పన్నులు కారణంగా నికర లాభం భారీగా తగ్గిపోయిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మయాంక్ అషర్ చెప్పారు.
రాజస్తాన్ చమురు క్షేత్రాల్లో తాము ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు ధర బ్యారెల్కు గత క్యూ3లో 68 డాలర్లుందని, ఈ క్యూ3లో 34.5 డాలర్లకు తగ్గిందని పేర్కొన్నారు. ఒక్కో బ్యారెల్కు 10 డాలర్ల చమురు సుంకం చెల్లిస్తున్నామని, రాయల్టీ, ఇతర లెవీలు కూడా ఉన్నాయని వివరించారు. ఆదాయం 42 శాతం క్షీణించి రూ.2,039 కోట్లకు తగ్గిందని పేర్కొంది.
మంచి ఫలితాలనిస్తున్న ఈఓఆర్
ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో సెస్ చార్జీలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం యోచి స్తోందని, ఇది ప్రోత్సాహకర పరిణామమని మయాంక్ పేర్కొన్నారు. రాజస్తాన్ బ్లాక్లో తమ అన్వేషణ, ఉత్పత్తి లెసైన్స్ 2019లో ముగుస్తుందని, పదేళ్ల పొడిగింపును కోరుతున్నామని, ప్రభుత్వం సానుకూలంగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలి తాలు నిరాశగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికవరీ కావడంతో కెయిర్న్ ఇండియా షేర్ బీఎస్ఈలో 2.6 శాతం వృద్ధి చెంది రూ.113కు పెరిగింది.