ఆ ప్రేమికుడి ఎదురుచూపు ఎండమావి అయింది
జకర్తా: కళ్లెదురుగా చావొస్తున్నా భరించగలరేమోగానీ.. కళ్లముందే అయినవాళ్లు దూరమవుతుంటే తట్టుకోవడం సాధరణంగానే భావోద్వేగాలు మిళితమైన ఉన్న మనిషికి సాధ్యం కాదు. చనిపోయేవరకు తనకు కావాల్సిన వారు లేకున్నా.. చనిపోతున్న ఆఖరిక్షణాల్లో మాత్రం తన మనసుకు దగ్గరయిన వ్యక్తి పక్కనే ఉండాలని కోరుకుంటారు.. ఇండోనేషియాలో డీడీ కోస్వారా అనే వ్యక్తి కూడా ఇలాగే కోరుకున్నాడు. అత్యంత అరుదైన జబ్బుతో బాధపడుతూ రోజుల తరబడి ఆస్పత్రికే పరిమితమై ఉంటూ ఏరోజైనా తనను చూసేందుకు తన భార్య రాకపోతుందా అని చూసిన ఎదురుచూపు చివరికి ఎండమావి అయ్యింది.
ఒంట్లో సత్తువ పోయింది. అరుదైన జబ్బు అతడి శరీరం మొత్తాన్ని పీల్చిపిప్పిచేసింది. చివరకు ప్రాణాలు తీసింది. అలా తన భార్యను కుటుంబాన్ని చూడకుండానే ప్రాణాలుకోల్పోయిన ఆ వ్యక్తికి తన భార్య అంటే ఎంత ఇష్టమో.. 'నేను కెరీరే ముఖ్యమని అనుకున్నాను.. ఉద్యోగం వచ్చాకే ఇంకేదైనా అనుకున్నాను.. కానీ ఎలా ఊహించగలరు? నా జీవితంలోకి ఒకమ్మాయి వస్తుందని.. ఆమె నాసర్వస్వం అవుతుందని' అని ఆ వ్యక్తి చెప్పిన మాటలే చెప్తాయి. ఇండోనేషియాలో డీడీ కోస్వారా వ్యక్తి ఉండేవాడు. కార్పెంటర్‌గా స్థిరపడిన అతడు కెరీర్లో ముందుకెళ్లాకే పెళ్లి వగైరా అనుకున్నాడు. కానీ, అనూహ్యంగా అతడి జీవితంలోకి ఒకమ్మాయి రావడంతో ఆమెపై మనసుపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ, కొద్ది కాలనికే అతడు ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి లెవెండోస్కీ-లుట్జ్ డిస్పాస్లియా బారిన పడ్డాడు. దీంతో అతడి శరీరంలో కాళ్లకు చేతులకు చెట్ల బెరడులాంటి ఆకారాలు పుట్టుకొచ్చాయి.
అతడిని ట్రీ మ్యాన్(వృక్ష మనిషి)గా కూడా పిలుస్తారు. ఫలితంగా అతడు ఏం పనిచేయలేనివాడిగా మారాడు. ఆపరేషన్లు చేసిన అవి తిరిగి పుట్టుకురావడం మొదలైంది. దీంతో చివరికి కుటుంబం నుంచి కూడా వెలివేయబడ్డాడు. ఆ తర్వాత బాడుంగ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి జబ్బు ముదరడంతో ఈ జనవరి 30న (2016) ప్రాణాలు విడిచాడు. ఆయన ఆస్పత్రిలో బ్రతికున్నన్నీ రోజులు అతడి భార్య కోసం ఎదురుచూసేవాడని, తన జబ్బు ఎప్పటికైనా తగ్గిపోయి తన కుటుంబంలో కలిసిపోతానని, కార్పెంటర్ జీవితాన్ని ప్రారంభిస్తానని కలలు కనేవాడని అదే ఆస్పత్రికి చెందిన నర్సులు తెలిపారు.