భవనాలకు అమరవీరుల పేర్లు
జైపూర్: రాజస్థాన్ లోని ఓ గ్రామం అమర జవానుల గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ వారి కీర్తిని పతాకస్థాయికి చేరుస్తోంది. సికర్ జిల్లాలోని దీన్వా లడ్కానీ గ్రామ ప్రజలు అమరవీరుల జ్ఞాపకార్ధంగా అక్కడి పాఠశాలలు, వైద్యశాలలు తదితర ప్రభుత్వ భవనాలకు అమరజవానుల పేర్లను పెడుతున్నారు. ఇప్పటివరకు గ్రామం నుంచి సైన్యంలోకి వెళ్లిన 9 మంది జవానులు అమరులయ్యారు. వీరిలో 8 మంది పేర్లను గ్రామంలోని ప్రభుత్వ భవనాలకు పెట్టారు. వీరి తర్వాత అమరుడైన సూరజ్ బుడానియా పేరును గ్రామ హెల్త్ కేర్ సబ్ సెంటర్ కు పెట్టాలని గ్రామస్తులు మెడికల్ ఆఫీసర్ ను కోరారు.
గ్రామస్తుల కోరికపై ప్రభుత్వానికి వినతిపత్రాన్ని పంపినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అందుకు ఒప్పుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ నిర్ణయంపై బుడానియా కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. 2010 ఆగస్టు 18న బుడానియా అమరులైనట్లు సోదరుడు రాజేష్ బుడానియా వెల్లడించారు. అప్పటినుంచి హెల్త్ సబ్ సెంటర్ కు సూరజ్ బుడానియా పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.