అధికారిక బంగ్లా ఆధునీకరణకు డైరెక్టర్ రూ. 42 లక్షల ఖర్చు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ డెరైక్టర్ ఆర్.సి. డేకా అధికార దుర్వినియోగం మరోసారి బట్టబయలైంది. నిబంధనలు లేకపోవడాన్ని అవకాశంగా మలచుకొని తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనుల కోసం ఏకంగా రూ. 42.13 లక్షల ఆస్పత్రి సొమ్మును డేకా ఖర్చు పెట్టిన విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. 2009-10లో ఎయిమ్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే డేకా ఆదేశాల ప్రకారం ఆయన బంగ్లాతోపాటు డిప్యూటీ డెరైక్టర్, డీన్, మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ ఆర్థిక సలహాదారు బంగ్లాల ఆధునీకరణ కోసం రూ. 73.6 లక్షల సంస్థ సొమ్మును ఖర్చు చేసినట్లు ఎయిమ్స్ తెలిపింది.
ఈ నిధుల్లో అత్యధికంగా డేకా బంగ్లా ఆధునీకరణ పనుల కోసం రూ. 42.13 లక్షలు (57 శాతం) ఖర్చు చేసినట్లు వివరించింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సుభాష్ అగర్వాల్ ఆర్టీఐ చట్టం కింద ఈ అంశంపై అడిగిన సమాచారాన్ని అందించింది. ఇప్పటికే తన భార్య, ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ అయిన డాక్టర్ దీపికా డేకా కోసం విచక్షణాధికారాల పేరుతో సీనియారిటీ జాబితాను పక్కనపెట్టి ఓ బంగ్లాను కేటాయించడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ ఉదంతం బయటపడటం గమనార్హం. కాగా, ఈ అంశంపై డేకా స్పందిస్తూ ఎయిమ్స్ ఇంజనీరింగ్ విభాగం అంచనా ప్రకారమే పాత బంగ్లా ఆధునీకరణ జరిగినట్లు చెప్పుకొచ్చారు.