లొకేషన్లోనే ఏడ్చేసిన దీపికా పదుకొనే
ఆరోజు ఎప్పటిలానే దీపికా పదుకొనె ఉత్సాహంగా షూటింగ్ స్పాట్‌లోకి అడుగుపెట్టారు. అందరికీ శుభోదయం చెప్పి, తీయబోయే సన్నివేశాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా ప్రిపేర్ అయ్యి, కెమెరా ముందుకెళ్లారు. వన్, టు త్రీ... అంటూ టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. కట్ చేస్తే.. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి కోపం వచ్చింది. దీపికాని చెడామడా తిట్టేశారు. రణవీర్‌సింగ్, దీపికా జంటగా స్వీయదర్శకత్వంలో భన్సాలీ రూపొందిస్తున్న చిత్రం ‘రామ్‌లీలా’. ఈ చిత్రంలో దీపికా పాత్ర పేరు ‘లీలా’. అది సంజయ్‌లీలా భన్సాలీ తల్లి పేరు.
అందుకని, ఈ పేరు పలికినప్పుడల్లా ఆయన మాటల్లో ఓ ఆత్మీయత కనిపించేదట. భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. పైగా ఆయన తల్లి పేరున్న పాత్ర చేయడం అంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందుకే లీలా పాత్రను అద్భుతంగా పోషించి, భన్సాలీ దగ్గర అభినందనలు కొట్టేయాలనుకున్నారు దీపికా. అయితే ఆయన అనుకున్న విధంగా నటించలేక మూడు, నాలుగు సార్లు తిట్లు తిన్నారు. బాధ తట్టుకో లేక ఒక్కోసారి ఏడ్చేశారు కూడా. ఆ విధంగా ఈ షూటింగ్ స్పాట్లో చాలాసార్లు అప్సెట్ అయ్యారు దీపికా. కానీ, షూటింగ్ చివరి రోజున మాత్రం ఆమెకు ‘స్వీట్ షాక్’ తగిలింది.
దీపికాకి గుడ్ బై చెబుతూ, ‘పర్ఫెక్షన్ కోసం ఒకటికి రెండు, మూడు సార్లు యాక్ట్ చేయాల్సి వస్తుంది. సీన్ ఓకే అయ్యేవరకు ఏ దర్శకుడికైనా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్‌తో తిట్టేస్తాం. ఏదేమైనా నువ్వు చాలా అద్భుతంగా యాక్ట్ చేశావ్. సూపర్’ అని అభినందించారట భన్సాలీ. షూటింగ్ స్పాట్లో తిట్టినందుకు బాధతో ఏడ్చిన దీపికా... ఈ కాంప్లిమెంట్ అందుకున్న తర్వాత ఆనందంతో కంట తడిపెట్టుకున్నారట.