దీప్తి మృతదేహం లభ్యం
గన్నవరం :
మండలంలోని కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలో ఆరు రోజుల క్రితం పడిపోయిన చౌటపల్లి దీప్తి మృతదేహం లభించింది. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ సమీపాన కాలువలో ఆమె మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన తన ప్రియుడు నక్కా నాగరాజుతో ఘర్షణ నేపథ్యంలో దీప్తి కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలో పడిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా కేసరపల్లి నుంచి బుద్ధవరం వరకు గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాపులపాడు మండలం వీరవల్లి వద్ద కాలువలో మహిళ మృతదేహం తేలియాడుతుండగా... స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించారు. దుస్తుల ఆధారంగా మృతురాలు దీప్తిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె కాలువలో పడి ఆరు రోజులు కావడంతో మృతదేహం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఈస్ట్ జోన్ ఏసీపీ డి.విజయభాస్కర్, సీఐ అహ్మద్అలీ తదితరులు దీప్తి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.