ఫిరాయింపు చట్ట సవరణ అనివార్యం
చట్టసభ సభ్యుల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ముదావహం. ఈ మేరకు తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేయడం స్వాగత పరిణామంగా పేర్కొన వచ్చు. లా కమిషన్ ఈ దిశగా కొన్ని సిఫార్సులు చేసిందని, వీటిని అధ్యయనం చేసేందుకు ఓ కమి టీని ఏర్పాటు చేసినట్టు విశదీకరించారు. అయితే మంత్రి ఈ మాటకు కట్టుబడి ఉండి చిత్తశుద్ధితో అమలుచేస్తే వలువలూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ బట్టకట్టేందుకు అవకాశం కలుగుతుంది.
ప్రలోభాలకు లొంగి, పలువురు చట్టసభ సభ్యులు విపక్షాల నుంచి అధికార పక్షంలోకి వెళ్తున్న వైనం అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల ముందు అధికార పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా వ్యవహరించిన వారు కొందరు అధికార పార్టీలోకి నిస్సిగ్గుగా ప్రవేశిస్తున్నారు. 2019 నాటికి నియోజక వర్గాల సంఖ్య పెరుగుతుందని, టికెట్ల కేటాయిం పునకు ఎలాంటి సమస్యా ఉండదని అధికార పార్టీ పెద్దలు ఊరిస్తున్నారు. అయితే 2026 వరకు నియోజక వర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
అయినప్పటికీ విపక్షాలకు చెందిన సభ్యులు నియోజకవర్గ ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు విరుద్ధంగా అధికార పార్టీ కండువాలను కప్పుకొం టున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విప క్షాలకు చెందిన పలువురు తెలుగుదేశం, టీఆర్ ఎస్ల్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ చేరికల నేప థ్యంలో అధికార పార్టీల్లో సంబంధిత నియోజక వర్గాల్లో పాత, కొత్తవారి మధ్య లుకలుకలు బయలు దేరాయి. పరస్పరం తిట్టుకోవడం, కొట్టుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా ఉంది. పార్టీ మార్పిడిదారులను ప్రజలు అసహ్యించుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది. సంబంధిత పార్టీని విడనాడిన వెంటనే పదవిని కోల్పోయే విధంగా చట్టాన్ని పటిష్టం చేయాలి. ఆయా పార్టీలు విప్ జారీ చేసేటప్పుడు, ఉల్లం ఘించిన సభ్యులపై అనర్హత వేటు వేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. స్పీకర్ల నిర్వాకమే దీనికి కారణ మని పేర్కొనవచ్చు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను గమనించిన వారికెవరి కయినా ఈ విషయం అర్థమవుతుంది. స్పీకర్ల పాత్ర వివాదాస్పదమైన నేపథ్యంలో అనర్హత వేటుకు సంబంధించి రాష్ట్ర గవర్నరుకు ఈ అధికారం కల్పిస్తే సమంజసంగా ఉంటుందని లోక్సత్తా జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ సూచించారు.
పార్టీ ఫిరాయింపు చట్ట నిబంధనలను అమలు పరచడంలో సభాపతి పాత్రను పునఃసమీక్షించాల్సి ఉందని, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఇటీవల వ్యాఖ్యానిం చారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతి నిధులు మరో పార్టీలో చేరాలనుకుంటే ముందుగా ఆ పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని స్పష్టం చేశారు. అలాగే ఓ ప్రజా ప్రతినిధి వేరే పార్టీకి విధేయత వ్యక్తం చేసినా సరే వేటు వేయాల్సిందేనని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల ఉత్తరా ఖండ్లో 9మంది కాంగ్రెస్ తిరుగుబాటు శాసన సభ్యులను అక్కడి స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనంలోకి తీసు కోవాలి. ఈ అనర్హత వేటుపై విచారణ జరిపిన హైకోర్టు కూడా వీరికి ముఖ్యమంత్రి రావత్ విశ్వాస పరీక్షలో ఓటుహక్కు ఉండదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులోనూ వారికి ఉపశమనం లభించలేదు.
స్పీకర్ల వ్యవస్థ వివాదాస్పదమైన నేపథ్యంలో జాతీయస్థాయిలో చర్చ జరగడం ఎంతయినా అవ సరమని వర్తమాన పరిస్థితులు నొక్కి చెబుతు న్నాయి. ఈ వ్యవస్థపై నమ్మకం కలిగే విధంగా ఫిరా యింపుల వ్యతిరేక చట్టాన్ని పటిష్టం చేయాలి. ఈ విషయమై చట్టాన్ని పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయశాఖ ప్రక టించడం ఓ ఆశాకిరణంగా కన్పిస్తోంది. ఈ చట్టాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజా స్వామ్యానికి మంచి మేలు జరగవచ్చు. లేనప్పుడు ఈ వ్యవస్థ భ్రష్టు పడుతుందని వేరేగా చెప్పనక్కర లేదు. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు మౌలికమైన చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే తప్ప ప్రజాస్వామ్యంలో మన దేశ ప్రతిష్ట పెరగదు. అధః పాతాళంలోకి దిగజారుతుందనే విష యాన్ని పాలకులు గుర్తించాలి.
- వాండ్రంగి కొండలరావు, సీనియర్ జర్నలిస్ట్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా
మొబైల్ : 94905 28730