భారత్కు అణు మద్దతివ్వండి: అమెరికా
అణు సరఫరాదార్ల కూటమి దేశాలను కోరిన అమెరికా
- ముందే మద్దతు ప్రకటించిన బ్రిటన్
- భారత్ ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ఆ ఐదు దేశాలు
వాషింగ్టన్: అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో చేరేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని ఎన్ఎస్జీ సభ్యదేశాలను అమెరికా కోరింది. ఈ అంశంపై అమెరికా అంతర్గత భద్రత అధికార ప్రతినిధి జాన్ కిర్బీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న సియోల్లో జరగనున్న ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశం నేపథ్యంలో సభ్య దేశాలకు అమెరికా ఈ విజ్ఞప్తి చేయడం భారత్కు లాభించనుంది. భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవద్దంటూ ఇటీవలే అమెరికా రక్షణ మంత్రి జాన్ కెర్రీ ఎన్ఎస్జీ సభ్య దేశాలకు లేఖను కూడా రాశారు.
ఇదిలా ఉండగా భారత ప్రయత్నాలకు అమెరికాతోపాటు తమ నుంచి కూడా పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ హామీఇచ్చారు. ఆయన గురువారం ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడినట్లు బ్రిటన్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. ఎన్ఎస్జీలో మొత్తం 48 సభ్యదేశాలున్నాయి. ఈ గ్రూపులో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా, ఆస్ట్రియా, ఐర్లాండ్, టర్కీ, దక్షిణాఫ్రికా దేశాలు అడ్డుపడుతున్నాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై భారత్ సంతకం చేయనందున ఎన్ఎస్జీలో చేరేందుకు తమకు అభ్యంతరాలున్నాయని చైనా వాదిస్తోంది. భారత్కు ఎన్ఎస్జీలో ప్రవేశం కల్పించినట్లయితే పాకిస్తాన్కు కూడా ప్రవేశం కల్పించాలని చైనా కోరుతోంది.
ఎన్ఎస్జీతో పెద్దగా లాభం లేదు: నిపుణులు
న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం తీసుకోవటం ద్వారా భారత్కు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని.. ప్రముఖ అణు శక్తి నిపుణుడు జి. బాలచంద్రన్ శుక్రవారం తెలిపారు. ‘భారత్-ఎన్ఎస్జీ సభ్యత్వం’ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వం వల్ల అణుశక్తి పెట్టుబడులను బలోపేతం చేసుకోవచ్చు కానీ.. అంతకుమించి భారత అణుశక్తి కార్యక్రమంలో పెద్దగా లాభనష్టాలేమీ ఉండవన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ సభ్యత్వానికి అడ్డుచెప్పకుండా ఉండేందుకే భారత సభ్యత్వానికి చైనా అడ్డుపడుతోందన్నారు.