Degree Supplementary examinations
-
పైసలిస్తేనే..
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో గతేడాది జరిగిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో భారీ మాస్ కాపీయింగ్ చోటు చేసుకుందని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నిర్థారించింది. ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకులు 104 మంది విద్యార్థులతో తమ కేంద్రంలో అక్రమంగా పరీక్ష రాయించినట్లు తేల్చారు. ఒక్కో విద్యార్థి నుంచి సబ్జెక్ట్‌కు గరిష్టంగా రూ.5 వేల చొప్పున వసూలు చేసి మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ జి.స్వర్ణలతను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి కోసం సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీకి (ఓయూ) సంబంధించిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు గత ఏడాది అక్టోబర్‌లో జరిగాయి. ఇందుకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ ఒకటి. సాధారణంగా పరీక్ష కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ సెంటర్లో పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్లు ఇస్తుంది. దీనిని ఆర్కే డిగ్రీ కాలేజ్ తమకు అనుకూలంగా మార్చుకుంది. సప్లిమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో మిలాఖత్ అయి... వేరే కేంద్రానికి సంబంధించి హాల్‌టిక్కెట్ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం కల్పించింది. వీరికోసం యూనివర్శిటీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్లను వాడుకుంది. ఈ విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేరుతో రెండేసి ఆన్సర్ షీట్లు సిద్ధమయ్యాయి. గుట్టుగా సాగిన ఈ వ్యవహారాన్ని యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. అక్టోబర్ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రంలో జరిగిన కంప్యూటర్ సైన్స్–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న యూనివర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్ ప్రాక్టీస్ స్కామ్‌ను పసిగట్టారు. ఆర్.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్ బుక్లెట్స్ వర్శిటీకి వచ్చాయి. అతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నెంబర్‌తో కూడిన బుక్లెట్ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నెంబర్‌తో కూడిన బుక్లెట్ సైతం అతడి నుంచి కాలేజీ ద్వారా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అతని ఫలితాన్ని ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ వర్శిటీ అధికారులను సంప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్ షీట్ తీసుకురావాల్సిందిగా సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్లెట్ అతడికి జారీ అయింది. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ ముద్ర ఉండగా... 7257384 నెంబర్‌తో కూడిన బుక్లెట్పై కాలేజీ ప్రిన్సిపాల్ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు. ఏకంగా బుక్‌లెట్స్‌ను విద్యార్థులకు ముందే అందించిన ఆర్కే కాలేజ్ కేంద్రంగా దీనికి సహకరించినట్లు యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు దీనికి పాల్పడినట్లు తేల్చారు. వీరికి వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించినా... పరీక్ష రాసింది మాత్రం ఆర్కే కాలేజీలో అని తేల్చారు. దీంతో వర్శిటీ అధికారులు ఓయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ కాలేజీ యాజమాన్యం, చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్స్‌తో పాటు అనేక మంది విద్యార్థులపై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, ఏపీ పబ్లిక్ ఎగ్జామ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. అదనపు డీసీపీ జోగయ్య, ఏసీపీ టి.లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఎస్సై బి.జగదీశ్వర్‌రావు దర్యాప్తు చేపట్టి మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి కాలేజీ ప్రిన్సిపాల్ పాత్ర రూఢీ కావడంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఎవరు అనే అంశంతో పాటు ఈ స్కామ్‌లో మిగిలిన నిందితులను గుర్తించేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్వర్ణలతను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
ఓయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ (రెగ్యులర్/ దూరవిద్య) సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ ఆఫ్ కంట్రోలర్ ప్రొ.అప్పారావు గురువారం ప్రకటిం చారు. ఈ పరీక్షలు అక్టోబర్ 15 నుంచి జరుగుతాయని, పరీక్ష ఫీజు అక్టోబర్ 4 వరకు చెల్లించవచ్చన్నారు. వివరాలను వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చు. -
అక్టోబర్ 6 నుంచి కేయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ 6 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, సెకండ్, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. పూర్తి టైం టేబుల్‌ను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడేళ్ల సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మూడో ఏడాది పరీక్షలు ఈ నెల 15 నుంచి 28 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నవి. డిగ్రీ మొదటి, రెండో ఏడాది పరీక్షలు అక్టోబర్ 1 నుంచి 17 వరకు జరగనున్నాయి. ఇవి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మూడేళ్ల పరీక్షలకు సంబంధించి 25 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటులో అధికారులు అప్రమతంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రశ్నపత్రాల తీకేజీ ఆరోపణలు ఎదుర్కొన్న కళాశాలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి మినహాయించారు. పాలకొండ, పాతపట్నం, కాశీబుగ్గ, సోంపేటలకు సంబంధించి ఆంధ్రాబ్యాంకుల్లో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జీసీఎస్ఆర్ రాజాం, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల, మహిళల, శ్రీకాకుళం రూరల్ మండలం గాయత్రి, ఆమదాలవలస, టెక్కలి, నరసన్నపేట, ఇచ్ఛాపురం ప్రభుత్వ కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 79 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగ నున్నాయి. విద్యార్థులు సంఖ్య మేరకు ప్రశ్న పత్రాలు తరలింపు జరగ నుంది. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు, కళాశాలల కోరిక మేరకు సప్లిమెంటరీ పరీక్షలు న్విహిస్తున్నాం. గతంలో లీకేజీ ప్రచారం జరిగిన ప్రాంతాల్లో ఆంధ్రా బ్యాంకుల్లో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణ పక్కాగా జరుగుతుంది. వర్సిటీ పరిశీలకులు, చీఫ్ సూపరింటెండెంట్లు నిరంతరం పరీక్షలు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం పరీక్ష నిర్వహణలో రహస్య పనులు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, ఎగ్జామినేషన్స్ డీన్, బీఆర్‌ఏయూ -
ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ..
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో పట్టుబడిన సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే కళాశాలలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక కళాశాలలో ఈ రోజు పరీక్ష జరుగుతున్న సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్న పర్యావేక్షకుడు హాల్‌టికెట్‌లో ఉన్న వ్యక్తి పరీక్ష రాస్తున్న వ్యక్తి ఒకరు కాదని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.