అక్ర‘మార్కుల’కు అడ్డుకట్ట పడేనా
యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 41,395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఓ వైపు పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. మరోవైపు చూచిరాతలను నిర్వహించేందుకు కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యూహరచన సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్ర ‘మార్కుల’కు అడ్డుకట్ట వేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.
వైవీయూ, న్యూస్‌లైన్: వైవీయూ పరిధిలోని 73 డిగ్రీ కళాశాలల్లో 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశా రు. గత కొన్నేళ్లుగా పరీక్షా కేంద్రాలుగా ఉన్న కొన్ని సెంటర్లను రద్దు చేయడంతో జీర్ణించుకోలేని యాజమాన్యాలు విద్యార్థులతో ఆందోళనలు సైతం నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ కళాశాలలు లేకపోవడంతో సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాయచోటి పట్టణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం ప్రభుత్వ కళాశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గతంలో సుండుపల్లె, గాలివీడు, సిద్దవ టం తదితర మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినప్పటికీ కాపీయిం గ్‌కు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. దీనికి తోడు ఈసారి సుండుపల్లెకు సెల్ఫ్సెంటర్ ఏర్పాటుతో పాటు గాలివీడులోని రెండు కళాశాలలను కుండమార్పిడి విధానంలో కేంద్రా లు కేటాయించారు. దీంతో యాజమాన్యాల మధ్య అవగాహనతో కాపీయింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని గట్టి నిఘా ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని భావి స్తున్న అధికారులపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల లాబీయింగ్ ఒత్తిడి పనిచేస్తుందో.. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలన్న వైవీయూ అధికారుల సంకల్పం నెరవేరుతుందో వేచి చూడాలి.
హైపవర్ కమిటీలు ఏర్పాటు
డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు విశ్వవిద్యాలయ అధికారులతో కూడిన 10 హైపవర్ కమిటీలను ఏర్పాటు చేశారు. మంగళవారం హైపవర్ కమిటీ బృందాలతో వీసీ శ్యాంసుందర్ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎటువంటి కాపీయింగ్ ఆస్కారం ఇవ్వకూడదని సూచించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల విభాగం నియంత్రణాధికారి ఆచార్య జి. సాంబశివారెడ్డి తెలిపారు.