నిధుల్లేక నీరసం
మార్కాపురం, న్యూస్‌లైన్: పంచాయతీల పాలకవర్గాలను నిధుల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 1020 పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎంపీడీఓలు, ఖజానాశాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, డివిజనల్ పంచాయతీ అధికారులు సమ్మెలో ఉండటంతో నిధులున్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లలో 155 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో ప్రభుత్వం వీటికి ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సి ఉంది. అవి కూడా ఆగిపోయాయి. పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తిపన్ను, సీనరేజి పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటితో పంచాయతీల్లో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సౌకర్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి అభివృద్ధి పనులు చేపడతారు.
సమ్మెతో నిలిచిన పనులు: రాష్ట్రాన్ని విభజిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయడంతో సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగులందరూ ఆగస్టు మొదటి వారం నుంచి సమ్మె బాట పట్టారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. బ్లీచింగ్ చల్లాలన్నా, కాలువల్లో పూడిక తీయాలన్నా, తాగునీటి పైపు లైన్లు మరమ్మతులు చేయించాలన్నా, వీధి లైట్లు వెలిగించాలన్నా పంచాయతీల్లో బిల్లులు కాకపోవడంతో సొంత నిధులు వెచ్చించి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు ఎక్కువై సర్పంచ్‌లు అప్పుల పాలు కాగా, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అదనపు ఖర్చులుగా మారాయి. ఇప్పటికిప్పుడు ఇంటి పన్నులు వసూలు చేయాలన్నా పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ఎలా వసూలు చేయాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. బ్లీచింగ్ పౌడర్ చల్లాలంటే ప్రతి పంచాయతీలో కనీసం రూ. 3 వేలు ఖర్చవుతోంది. తీర్మానాలు లేకుండా సొంత డబ్బులు ఖర్చు పెడితే రేపటి పరిస్థితి ఏమిటని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీల్లో, నోటిఫైడ్ పంచాయతీలకు రూ. 10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ. 5 లక్షలను ప్రత్యేక గ్రాంట్‌గా విడుదల చేసింది. ఏకగ్రీవమైన పంచాయతీల్లో సర్పంచ్‌లు ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ దఫాలో కూడా ఏకగ్రీవమైన వాటికి ఇదే మొత్తంలో నిధులు విడుదల కావచ్చని భావిస్తున్నప్పటికీ ప్రభుత్వ సిబ్బంది సమ్మెలో ఉండటంతో నిధులందలేదు. పంచాయతీల్లో పనిచేస్తున్న స్వీపర్లు, బిల్ కలెక్టర్లు, మెకానిక్‌లకు రెండు నెలల నుంచి సర్పంచ్‌లు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.