ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సర్వే, డిజైన్ పనులు ఆరంభమయ్యాయి. నార్త్-సౌత్ రైల్ కారిడార్‌గా పేరొందిన ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైలు మార్గంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చైనా బృందం ఏపీ, తెలంగాణ లో అధ్యయనం చేపట్టింది. దేశంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్, చైనా ప్రభుత్వాల నడుమ ఒప్పందం కుదిరింది.
సర్వే, డిజైన్ పనులు ఉచితంగా చేసేందుకు చైనాలోని సియాయున్ రైల్వే కంపెనీ ముందుకు రావడంతో ఈ బాధ్యతల్ని కేంద్రం ఆ బృందానికే అప్పగించింది. కో ఆర్డినేటింగ్ ఏజెన్సీగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) వ్యవహరించనుంది. దీంతో ఫీజిబిలిటీ అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కూడిన చైనా బృందం సోమవారం నుంచి తెలంగాణ, ఏపీలో పర్యటన ప్రారంభించింది.
ముందుగా ఏపీ రవాణా ముఖ్య కార్యదర్శి శాంబాబ్‌తో చైనా బృందం సచివాలయంలో భేటీ అయింది. తెలంగాణ ముఖ్య కార్యదర్శితో భేటీ కుదరకపోవడంతో మంగళవారం అధ్యయనానికి చైనా బృందం విజయవాడ బయలుదేరి వెళ్ళనుంది. కాగా, ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ఉన్న రైల్వే ట్రాక్ సామర్థ్యం గంటకు 160 కి.మీ. మేర వేగంతో రైళ్లను నడిపేందుకు మాత్రమే సాధ్యమవుతోంది. హైస్పీడ్ రైలు మార్గానికి ఈ ట్రాక్ సామర్ధ్యం సరిపోదు. కాబట్టి కొత్తగా ట్రాక్ ఏర్పాటు చేసేందుకు చైనా బృందం నిర్ణయించింది. గంటకు 350 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా ట్రాక్ డిజైన్ రూపొందించాలని నిర్ణయించారు.