ఢిల్లీని టార్గెట్ చేసిన ఐసిస్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నెల 26న ఢిల్లీలోని కోర్టులపై దాడి చేయడానికి పథకం వేసినట్టు నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. కొన్నిరోజులుగా ఢిల్లీలో తలదాచుకున్న ఐసిస్ సానుభూతిపరులు.. ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టులపై దాడి చేసేందుకు వ్యూహం పన్నారని నిఘా అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు.
ఐసిస్ ఉగ్రవాదులు తొలుత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. కాగా ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని మార్చుకుని కోర్టులు, ఇతర ప్రాంతాల వైపు మళ్లించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే వేడులకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఎట్టి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఐసిస్ భావజాలానికి దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల ఆకర్షితులవుతున్నట్టు తొలుత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కాగా ఉత్తర భారతదేశంలోనూ ఐసిస్‌కు సానుభూతిపరులున్నట్టు సమాచారం అందింది.