ఆకాశంలో హరివిల్లు
న్యూఢిల్లీ: రాష్ట్ర పర్యాటక అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న ఢిల్లీ అంతర్జాతీయ పతంగుల ఉత్సవాన్ని రాష్ట్ర పర్యాటక, న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఢిల్లీహాట్లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవంలో రంగురంగుల భారీ పతంగులు కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా మంత్రి భారతి స్వయంగా పతంగులు ఎగురవేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా మంది స్థానికులు త్రివర్ణ పతంగులను నింగిలోకి పంపించారు. ఢిల్లీవాలాలు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజధానిలో చాలా ఏళ్లుగా పతంగుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా దేశవిదేశాల నుంచి పతంగుల నిపుణులు (కైట్ ఫ్లయర్స్) ఈ ఉత్సవానికి హాజరయ్యారు. అమెరికాకు చెందిన బార్బరా మీయర్, ఇంగ్లండ్‌కు చెందిన బాబ్, బీరట్‌కు చెందిన సమీ సాహెగ్స్, ఇండోనేషియావాసులు టింటన్, సారీ, దక్షిణ కొరియా నుంచి చో, ఫ్రాన్స్ నుంచి ఆంటోనియా వంటి కైట్ ఫ్లయర్లు ఈ ఉత్సవంలో భారీ పతంగులను ప్రదర్శిస్తున్నారు. వీటి హెక్సాజెన్, స్లెడ్, డెల్టా, బారొంగి వంటి పలు రకాల పతంగులు ఆకాశంలో విహరించనున్నాయి.
కేరళ, చెన్నయ్, రాజ్‌కోట్, చండీగఢ్, అహ్మదాబాద్, మంగళూరు, త్రివేండ్రంతోపాటు ఢిల్లీకి చెం దిన కైట్ ఫ్లయర్లు కూడా ఈ ఉత్సవానికి వచ్చారు. సాధారణ గాలిపటాలతోపాటు రాత్రిపూట ప్రదర్శించే నైట్కైట్ ఫ్లయింగ్ మరో ఆకర్షణ. భారీ పతంగులకు ఎల్ఈడీ విద్యుత్ దీపాలను అమర్చి ఎగురవేస్తారు. ఒక్కో భారీ గాలిపటంలో 100 వరకు చిన్న పతంగులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పురాతన కళ గురించి వీక్షకులకు తెలియజేసేందుకు వేదిక వద్ద ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
టిష్యూ పేపర్, ఎలాస్టిక్ పేపర్, వెదురు, వస్త్రం తదితర వ స్తువులతో తయారు చేసిన భారీ పతంగుల వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. మూడు రోజులపాటు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలూ ఉంటాయి. సాహిత్య కళాపరిషత్ కళాకారులు జానపద నృత్యాలు మరో ఆకర్షణ. మ్యాజిక్, పప్పెట్ షోలు, బయోస్కోప్, లాం గ్మన్ వంటివి కూడా వినోదం పంచనున్నాయి. పతంగుల తయారీ విధానం గురించి చిన్నారులకు ఇక్కడి నిపుణులు శిక్షణ కూడా ఇస్తున్నారు. దీనికితోడు బాలలకు శనివారం మధ్యాహ్నం పెయిం టింగ్ పోటీలు నిర్వహిస్తారు.