Delhi Lieutenant-Governor
-
ఆప్‌కు భారీ షాక్.. ఆఫీస్ సీజ్‌కు నోటీసులు
ఢిల్లీ: అధికారిక పార్టీ ఆమ్ ఆద్మీకి ఎల్జీ వీకే సక్సేనా భారీ ఝలక్ ఇచ్చారు. పదిరోజుల్లో రూ. 164 కోట్లు చెల్లించాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇప్పించారాయన. అలా చేయని పక్షంలో.. చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయని ఆ రికవరీ నోటీసుల్లో పేర్కొని ఉంది. రూ. 164 కోట్ల చెల్లింపునకు ఇదే చివరి అవకాశం. నోటీసులకు స్పందించింది పదిరోజుల్లోగా ఆప్ కన్వీనర్ ఈ డిపాజిట్ చేయాలి. లేకుంటే చట్టం ప్రకారం ముందుకెళ్తాం. పార్టీకి సంబంధించి ఆస్తులను సైతం జప్తు చేయడానికి వెనకాడం. ఆప్ కార్యాలయానికి సీజ్ చేస్తాం అంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను సైతం అందులో ప్రస్తావించింది డీఐపీ. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆప్ ప్రకటనలు ఇచ్చుకుందని, అందుకోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఆప్ వృధా ఖర్చు చేసిందని పేర్కొంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆప్ మీద చర్యలకు ఆదేశించారు. డిసెంబర్ 20వ తేదీన 97 కోట్ల రూపాయల్ని ఆప్ నుంచి రికవరీ చేయాలంటూ ఎల్జీ ఆదేశించారు కూడా. అయితే.. పొలిటికల్ యాడ్ల మీద 2017, మార్చి 31 దాకా రూ.99 కోట్లు ఖర్చు చేశారని, మిగిలిన రూ.64 కోట్లను ఖర్చు చేసినదానికి వడ్డీగా తాజా నోటీసుల్లో పేర్కొంది డీఐపీ. ఎల్జీ ఆదేశాలను ఆప్ మొదటి నుంచి బేఖాతరు చేస్తూ వస్తోంది. బీజేపీతో కలిసి ఆప్ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎల్జీ మండిపడుతోంది కూడా. ఇక ఇప్పుడు రూ. 163 కోట్లకుపైగా రికవరీకి.. అదీ పది రోజుల గడువు విధించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
మోదీజీ మమ్మల్ని పని చేసుకోనివ్వండి!
ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు వేసిన ఆప్ న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌తో వివాదాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం వినూత్న రీతిలో విజ్ఞప్తి చేసింది. ‘ప్రధానిజీ.. మమ్మల్ని పని చేసుకోనివ్వండి’ అంటూ ఢిల్లీ అంతటా పోస్టర్లు అతికించింది. ఏసీబీ, ఢిల్లీ మహిళా కమిషన్ల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ‘ప్రధాన మంత్రి సర్, దయచేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి. ఢిల్లీ ప్రభుత్వం మెరుగ్గా పని చేస్తోంది’ అని పోస్టర్లలో ఆప్ పేర్కొంది. ఢిల్లీ గవర్నర్ వైఖరి హాస్యాస్పదం.. కేజ్రీవాల్: ఢిల్లీ ప్రభుత్వం అంటే తానేనంటూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్ పేర్కొనడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి హాస్యాస్పదమని కేజ్రీవాల్ ఆయనకు గురువారం ఘాటుగా లేఖ రాశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా స్వాతి మలివాల్‌ను కేజ్రీవాల్ నియమించడం చెల్లదంటూ ఎల్జీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, స్వాతి మనివాల్ నియామకానికి ఆమోదం కోసం ఫైలును ఢిల్లీ ప్రభుత్వం గురువారం ఎల్జీకి పంపిన అనంతరం కేజ్రీవాల్ ఆయనకు లేఖ రాశారు. ఈ అంశంపై వివాదం రేగేందుకు ఈగో(అహం) సమస్య మాత్రమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఎల్జీ ఇలా వ్యవహరించడమే కారణమని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘ఢిల్లీ ప్రభుత్వం మీరేనని అంటున్నారు. తనకు తానే ప్రభుత్వమని ఏ వ్యక్తి అయినా ఎలా చెప్పగలరు? ఇది నియంతృత్వానికి దారి తీస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఉండబోదు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఉంది. ఇది ఏ ఒక్కరిదీ కాదు. స్వాతి మనివాల్ నియామక ఫైలును పంపించడంలో నాకేమీ ఈగో సమస్య లేదు. చేతులు జోడించి కోరుతున్నా. దయచేసి ఆ ఫైలుపై సంతకం చేయండి’ అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. కాగా, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వద్దకు ఢిల్లీ ప్రభుత్వం ఆమె అపాయింట్మెంట్కు సంబంధించిన ఫైలును పంపింది. గురువారం ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎల్జీ జంగ్‌ను కలిసి దీనిపై చర్చించారు. ఆమోదం కోసం స్వాతి నియామకం ఫైలును ప్రభుత్వం ఎల్జీకి పంపిందని సిసోడియా విలేకరులకు చెప్పారు. -
ప్రభుత్వమంటే నేనే..!
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు * ఎల్జీ, సీఎం కేజ్రీవాల్ మధ్య మరో నియామక వివాదం న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య నియామకాల విషయంలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో నియామకం వీరి మధ్య వివాదాన్ని రేపింది. ఢిల్లీ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా స్వాతి మలివాల్‌ను నియమిస్తూ కేజ్రీవాల్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని ప్రకటించడంతోపాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయం చేసిన వ్యాఖ్యలు ప్రకంపనాలు సృష్టించాయి. ‘ఢిల్లీలో ప్రభుత్వం అంటే నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్ గవర్నరే. ఉన్నతస్థాయి అధికారుల నియామకాలతోపాటు ముఖ్యమైన విషయాలను నిర్ణయించేది ఎల్జీనే’ అని జంగ్ కార్యాలయం ఒక లేఖను సీఎం కార్యాలయానికి పంపింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 239లో పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం నేషనల్ కేపిటల్ టెరిటరీకి ప్రభుత్వమంటే లెఫ్ట్‌నెంట్ గవర్నరే అని స్పష్టంచేసింది. ఆర్టికల్ 239ఏఏ ప్రకారమే ఎల్జీ నియామకం జరిగిందని వివరించింది. స్వాతి నియామకం నిబంధనలకు విఘాతం కలిగిస్తుందని, అందువల్ల దానికి చట్టబద్ధత లేదని స్పష్టంచేసింది. 30 ఏళ్ల స్వాతి రెండు రోజుల కిందట మహిళా కమిషన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, ఎల్జీ కార్యాలయం తాజాగా ఆమె నియామకాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఆమె అపాయింట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 29లోగా పంపాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిని ఎల్జీ కార్యాలయం ఆదేశించింది. అయితే, కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగానే స్పందించింది. ఈ నిర్ణయంపై పునరాలోచన ఉండదని, సీఎం కేజ్రీవాల్ రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఆమెను నియమించారని రవాణా మంత్రి గోపాల్ రాయ్ స్పష్టంచేశారు. ఆఫీసుకు తాళం వేస్తామన్నారు ఎల్జీ నజీబ్‌జంగ్ బుధవారం తనకు ఫోన్ చేసి రేపటి నుంచి ఆఫీసుకు రావొద్దని చెప్పారని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీనిపై వివరణ కోరగా... ఎల్జీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందని మాటమార్చారు. మరోవైపు జంగ్ కార్యాలయం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అయితే ఎల్జీ కార్యాలయం రాజ్యాంగబద్ధతను తాను గౌరవిస్తానని స్వాతి చెప్పారు. అయితే, ఇదేమంత పెద్దవిషయమేం కాదని, చాలా చిన్నదన్నారు. త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.