మోదీజీ మమ్మల్ని పని చేసుకోనివ్వండి!
ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు వేసిన ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌తో వివాదాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం వినూత్న రీతిలో విజ్ఞప్తి చేసింది. ‘ప్రధానిజీ.. మమ్మల్ని పని చేసుకోనివ్వండి’ అంటూ ఢిల్లీ అంతటా పోస్టర్లు అతికించింది. ఏసీబీ, ఢిల్లీ మహిళా కమిషన్‌ల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ‘ప్రధాన మంత్రి సర్, దయచేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి. ఢిల్లీ ప్రభుత్వం మెరుగ్గా పని చేస్తోంది’ అని పోస్టర్లలో ఆప్ పేర్కొంది.
ఢిల్లీ గవర్నర్ వైఖరి హాస్యాస్పదం.. కేజ్రీవాల్: ఢిల్లీ ప్రభుత్వం అంటే తానేనంటూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్‌జీ) నజీబ్ జంగ్ పేర్కొనడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి హాస్యాస్పదమని కేజ్రీవాల్ ఆయనకు గురువారం ఘాటుగా లేఖ రాశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా స్వాతి మలివాల్‌ను కేజ్రీవాల్ నియమించడం చెల్లదంటూ ఎల్‌జీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, స్వాతి మనివాల్ నియామకానికి ఆమోదం కోసం ఫైలును ఢిల్లీ ప్రభుత్వం గురువారం ఎల్‌జీకి పంపిన అనంతరం కేజ్రీవాల్ ఆయనకు లేఖ రాశారు. ఈ అంశంపై వివాదం రేగేందుకు ఈగో(అహం) సమస్య మాత్రమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఎల్‌జీ ఇలా వ్యవహరించడమే కారణమని కేజ్రీవాల్ ఆరోపించారు.
‘ఢిల్లీ ప్రభుత్వం మీరేనని అంటున్నారు. తనకు తానే ప్రభుత్వమని ఏ వ్యక్తి అయినా ఎలా చెప్పగలరు? ఇది నియంతృత్వానికి దారి తీస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఉండబోదు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఉంది. ఇది ఏ ఒక్కరిదీ కాదు. స్వాతి మనివాల్ నియామక ఫైలును పంపించడంలో నాకేమీ ఈగో సమస్య లేదు. చేతులు జోడించి కోరుతున్నా. దయచేసి ఆ ఫైలుపై సంతకం చేయండి’ అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. కాగా, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వద్దకు ఢిల్లీ ప్రభుత్వం ఆమె అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన ఫైలును పంపింది. గురువారం ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎల్జీ జంగ్‌ను కలిసి దీనిపై చర్చించారు. ఆమోదం కోసం స్వాతి నియామకం ఫైలును ప్రభుత్వం ఎల్జీకి పంపిందని సిసోడియా విలేకరులకు చెప్పారు.