దోపిడీదొంగలు వస్తున్నారు.. జాగ్రత్త!
గోవా ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటూ చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై రక్షణ మంత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఘాటుగా విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి కొంతమంది దోపిడీదారులు గోవాకు వస్తున్నారని, గోవాను దోచుకోడానికే వాళ్లు వస్తున్నారని, వాళ్లతో గోవా వాసులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘‘కొంతమంది ఢిల్లీవాలాలు ఢిల్లీని దోచుకున్న తర్వాత గోవాను కూడా దోచుకోవాలని చూస్తున్నారు. ఓ అవకాశం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. వాళ్లు కాకపోతే.. వాళ్ల ప్రైవేటు సెక్రటరీలు దోచుకుంటారు. ఆ ప్రైవేటు సెక్రటరీలు కమీషన్ల కోసమే చూస్తారు’’ అంటూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్‌పై కూడా విమర్శలు చేశారు.
గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ జన్మదినం సందర్భంగా జరిగిన సభలో పారికర్ మాట్లాడారు. గోవా సంపద మీద చాలా మంది కళ్లు ఉన్నాయని.. అందువల్ల గోవా వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను ఇక్కడికొస్తే బీజేపీని ఓడించాలన్న వాళ్ల కుట్రలు భగ్నమవుతాయని.. అందుకే తాను వస్తున్నానంటే వాళ్లకు కడుపు మంట అని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలో ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ రెండుసార్లు పర్యటించారు.