9కి పెరిగిన డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ మృతుల సంఖ్య
ముంబయి - డెహ్రడూన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఆ ఘటనలో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది, దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లోని బోగి - ఎస్3లో చెలరేగిన మంటలు ఎస్ -4, 5 లకు వ్యాపించాయి.
రైలులో అగ్నిప్రమాదం సంభవించినట్లు అటు డ్రైవర్గాని, ఇటు గార్డ్ గాని గమనించలేదు. రైల్వే గ్యాంగ్ మెన్ చూసి వారికి సమాచారం అందించడంతో వారు అప్రమత్తమైయ్యారు. అయితే చలి కారణంగా ప్రయాణికులు కిటికిలు మూసి వేశారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగి, బోగిలలో పోగ వ్యాపించింది. దాంతో ప్రయాణికులు ఎటువెళ్లలేని పరిస్థితుల్లో సజీవ దహనమైయ్యారు.సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంటలకు అదుపులోకి తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని థానే జిల్లా ధాను రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో బాంద్రా- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ రోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుగురు అని రైల్వే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
అలాగే ఢిల్లీ - లోక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. దాంతో ఆ రైలును ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. అయితే ప్రయాణికుల్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.