క్వార్టర్ ఫైనల్లో సోమ్‌దేవ్
న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక్కడి ఆర్కే ఖన్నా స్టేడియంలో బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు వరుస సెట్లలో డి వూ (చైనా)పై విజయం సాధించాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ అయిన సోమ్‌దేవ్ 6-2, 6-2తో ప్రపంచ 212 ర్యాంకర్ డి వూపై అలవోక విజయం సాధించాడు. 62 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు.
ఇద్దరి మధ్య ఇదే తొలి పోరు కాగా... రెండు సెట్లలోనూ భారత స్టార్ విజృంభించడంతో చైనా ఆటగాడు చేతులెత్తేశాడు. తన ఆటతీరుపై సోమ్‌దేవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘వూ అషామాషీ ప్రత్యర్థి కాదు. కానీ మ్యాచ్‌లో మాత్రం గట్టిపోటీ ఎదురవలేదు. మొత్తం మీద సునాయాసంగా ముందంజ వేయడం ఆనందంగా ఉంది. కోర్టు కూడా నా ఆటతీరుకు బాగా సరిపోయింది. ఇంకా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని సోమ్‌దేవ్ పేర్కొన్నాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జోడి 6-3, 5-7, 11-9తో మూడో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.