భద్రత కట్టుదిట్టం - ఢిల్లీ సురక్షితం
న్యూఢిల్లీ: పెషావర్, సిడ్నీ నగరాలలో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో రాజధాని నగర భద్రతకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. నగరం సురక్షితంగా ఉందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఎదురుకోవడానికి తమ సిబ్బంది సదా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు నిత్యం తమ పరిసర వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని సదా అప్రమత్తంగా ఉంటారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుం టున్నాం’’అని బస్సీ పేర్కొన్నారు. స్కూల అధికారులకు ఏవైనా నిర్దిష్టమైన సూచనలు చేశారా అన్న ప్రశ్నకు సంబంధిత వర్గాలకు అవసరమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
ఢిల్లీ పోలీసు అధికారులు బుధవారం మధ్యాహ్నం హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి హాజరైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరంలోని పాఠశాలలతో పాటు, ఫైవ్ స్టార్ హోటళ్లు, మాల్స్, రెస్టారెం ట్లు, ఇతర కీలకమైన ప్రాంతాలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను వీరు వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు ఇదివరకే నగరంలోని పాఠశాలలు, కాలేజీలకు కొన్ని మార్గదర్శకాలను సూచించారు. పలువురు ఎస్హెచ్ఓలు తమ పరిధిలోని విద్యా సంస్థలను బుధవారం సందర్వించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విద్యార్థులు లోపల ఉన్నప్పుడు స్కూలు గేట్లను మూసివేయాలని, గార్డులను నియమించుకోవాలని, తనిఖీ చేసి, ఆధారాలను పరిశీలించిన తరువాతనే బయటి వారిని లోపలికి అనుమతించాలని పోలీసు లు పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు.
నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు సమీపంలో పీసీఆర్ వ్యాన్లను మోహరిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో బీట్ కానిస్టేబుళ్లు గస్తీ నిర్వహిస్తున్నారు. సిడ్నీలో హోటల్‌ను, పెషావర్‌లో స్కూల్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని బస్సీ చెప్పారు. అందువల్ల స్కూళ్లు, కాలేజీలు, విదేశీ దౌత్య కార్యాలయాలు, మెట్రో స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, విమానాశ్రయాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశామని అన్నారు. కీలకమైన ప్రాంతాల వద్ద బుధవారం స్వాట్ బృందాలు మాటు వేసి కనిపించాయి. క్విక్ రియాక్షన్ బృందాలు (క్యూఆర్టీ), క్విక్ రెస్పాన్స్ వెహికల్స్ (క్యూఆర్వీ)లను సిద్ధంగా ఉండాలని ఆదేశించా రు. పెషావర్‌లో సైనిక పాఠశాలపై దాడి జరిగిన నేపథ్యంలో ఢిల్లీ, కం టోన్మెంట్, చాణక్యపురిలోని ఆర్మీ స్కూళ్లకు ప్రత్యేక భద్రతను కల్పిం చామని కమిషనర్ వివరించారు. ఈ నెల 5వ తేదీనే ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారని, ముందే భద్రతను ముమ్మరం చేశామని చెప్పారు.
వాహనాల వేగానికి కళ్లెం!
రోడ్లపై వేగంగా దూసుకుపోతూ పౌరుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న వాహనాలను అదుపు చేసేందుకు నగర పోలీసులు ‘ఇంటర్‌సెప్టర్ వ్యాన్’లను బుధవారం ప్రారంభించారు. ఈ వాహనాల్లో అమర్చిన లేజర్ ఆధారిత కెమెరాలు పగటిపూటే కాకుండా రాత్రి వేళల్లో కూడా వాహనాల వేగాన్ని పసిగడతాయి. ఈ యంత్రాల సహాయంతో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చలాన్లను జారీ చేస్తామని పోలీసులు చెప్పారు. ఇంటర్‌సెప్టర్ వ్యాన్లను ఇండియాగేట్ వద్ద పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు నిండా కార్లు వెళుతున్నప్పటికీ వాటిలో అత్యంత వేగంగా వేళ్లే వాహనాన్ని ఈ కెమెరా గుర్తించగలదని, రెండు క్షణాలకో చలానాను అది జారీ చేయగలదని బస్సీ చెప్పారు. వేగంగా వెళ్లే వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో సహా ఫోటో తీయగలదని అన్నారు.