హెల్ప్ ప్లీజ్..!
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ శాఖపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నగరంలో పోలీసు శాఖలో అవినీతి నిర్మూలనకు ఏర్పాటుచేసిన అవినీతి నిరోధక ెహ ల్ప్లైన్కు ఒక నెలలోనే సుమారు 23 వేల ఫిర్యాదులు అందడం గమనార్హం. వీటిని పోలీస్ దర్యాప్తు శాఖ పరిశీలిస్తోంది. ఢిల్లీ పోలీస్ శాఖ సుమారు ఒక నెల కిందట అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేస్తూ రెండు నంబర్లను (1064, 9910641064) నగరవాసుల కోసం అందుబాటులో ఉంచింది. కాగా, ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ మధ్య ఈ రెండు నంబర్లకు సుమారు 23 వేల ఫిర్యాదులందాయని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ నెల రోజుల్లో అవినీతి ఆరోపణల కింద పోలీస్ శాఖలోనే 9 మంది ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డ్ స్థాయి వ్యక్తులపై కేసులు నమోదయ్యాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(విజిలెన్స్) సింధు పిళ్లై తెలిపారు. ఈ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసినప్పటినుంచి రోజుకు 600 ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. వాట్సప్ హెల్ప్‌లైన్‌కు ఈ నెల ఆరవ తేదీవరకు 20,698 మెసేజ్‌లు అందాయన్నారు. కాగా, వచ్చిన ఫిర్యాదుల్లో 5 శాతం పోలీస్ శాఖలో అవినీతిపై కాగా, మిగిలినన్నీ వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులని ఒక అధికారి చెప్పారు. కాగా, ఆయా ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించామని వివరించారు.
ఇదిలా ఉండగా, పోలీస్ శాఖలో అవినీతిని అంతమొందించేందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ సూచన మేరకు ఈ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (విజి లెన్స్) జి.సి.ద్వివేది తెలిపారు. ప్రస్తుతం ఆయనే ఈ హెల్ప్‌లైన్ వ్యవస్థకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఎవరిపైన ఫిర్యాదు వచ్చిందో సదరు అధికారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని ఆయన వివరించారు. ‘మాకు ఎవరిపైనైనా సాక్ష్యంతో సహా ఫిర్యాదు అందితే వెంటనే దానిపై సీనియర్ అధికారులకు సమాచారమిస్తాం. తర్వాత సదరు ఫిర్యాదుదారును పిలిచి మాట్లాడతాం. అలాగే అతడు ఇచ్చిన సాక్ష్యం క్లిప్‌ను రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపిస్తాం. సదరు ఫిర్యాదు నిజమేనని తేలితే నిందితుడిపై కేసు నమోదుచేసి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటాం..’ అని ఆయన వివరించారు.
మొదట్లో ప్రతిరోజూ 2,300 కంటే ఎక్కువగా ఫిర్యాదులు అందేవి.. వీటిలో అధికంగా సదరు హెల్ప్‌లైన్ నంబర్లు పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికే చేసేవారు. ఇదిలా ఉండగా, రోజంతా పనిచేసే ల్యాండ్‌లైన్ నంబర్ 1064కు వచ్చే ఫిర్యాదులను ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 20 మంది కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్ నిరంతరం నాలుగు కనెక్షన్లలో నమోదు చేసుకుంటున్నారు. అలాగే సీనియర్ విజిలెన్స్ అధికారి నేతృత్వంలో 9910641064 నంబర్ పనిచేస్తోంది.