ప్రేయసిని.. ఆమె మాజీ భర్తను తుపాకీతో కాల్చి!
దేశ రాజధాని ఢిల్లీ సిరి కోట సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో మరో ట్విస్ట్ తెలిసింది. నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీయూఐ)లో శనివారం రాత్రి ఇద్దరు ప్రేమికులపై ఎవరో దుండగుడు కాల్పులు జరిపాడని ప్రచారం జరిగింది. వాస్తవానికి అక్కడ జరిగింది వేరే. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్‌సీయూఐ విద్యార్థి మూడేళ్ల కిందట రాజేంద్ర అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరి మధ్య గొడవలు రావడంతో కొన్ని నెలల కిందట విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తన ఫొటోను ఓ వివాహ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
కాజల్ జతిన్ సర్కార్ అనే వ్యక్తి ఎన్‌సీయూఐ విద్యార్థిని సమాచారం తెలుసుకుని ఆమెను సంప్రదించాడు. గతంలో పెళ్లి విషయాలను జతిన్‌కు చెప్పింది. కొంతకాలం నుంచి ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సముఖంగా ఉంది. సోషల్‌మీడియాతో ఈ వివరాలు తెలుసుకున్న యువతి మాజీ భర్త రాజేంద్రన్ క్యాంపస్ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. దీంతో యువతి తన కాబోయే భర్త జతిన్‌కు ఫోన్ చేసింది. అక్కడికి వచ్చిన జతిన్, రాజేంద్రన్‌కు ఎంత నచ్చజెప్పినా వినకుండా గొడవ పడుతూనే ఉన్నాడు. ఓపిక నశించిన జతిన్ రాజేంద్రన్‌పై తనవెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఆ తర్వాత అదే ఆవేశంలో లవర్(కాబోయే భార్య) పై కాల్పులు జరిపి.. చివరికి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఆ ముగ్గురు ఎయిమ్స్ ట్రౌమా సెంటర్లో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుమారుడు జతిన్ సర్కార్. తండ్రి రివాల్వర్‌తో కాల్పులు జరిపిన జతిన్‌పై కేసు నమోదైంది.