జర్మన్ యువకుడిని పొడిచి.. దోచుకున్నారు!
ఒకవైపు భారతీయులపై అమెరికా, ఇతర దేశాల్లో దాడులు జరుగుతుంటే, మరోవైపు ఇక్కడ దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 ఏళ్ల జర్మన్ యువకుడిపై ఇద్దరు భారతీయులు దాడి చేశారు. అతడిని కత్తితో పొడిచి, దోచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని కశ్మీరీ గేట్ సమీపంలో జరిగింది. బెంజిమన్ స్కాల్ట్ అనే ఈ యువకుడు చాందినీ చౌక్ నుంచి తిరిగి వస్తుండగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఆటోలో వస్తుండగా డ్రైవర్ మరొకరిని ఎక్కించుకున్నాడని, ఇద్దరూ కలిసి అతడిని కత్తితో పొడిచి అతడి వద్ద ఉన్న ఫోన్, వాలెట్ దోచుకున్నారని పోలీసులు చెప్పారు. రక్తం కారుతున్న స్కాల్ట్ గీతా కాలనీ ఫ్లై ఓవర్ వైపు పారిపోతుండగా స్థానికులు అతడిని చూసి వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.
గుర్తుతెలియని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ జతిన నర్వాల్ తెలిపారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ విషయాన్ని జర్మన్ రాయబార కార్యాలయానికి తెలియజేశారు. నిందితుడు వేరే ఏవైనా కేసుల్లో ఉన్నాడేమో పరిశీలిస్తున్నారు. 2015 సంవత్సరంలో ఢిల్లీలో నలుగురు విదేశీయులు హత్యలకు గురయ్యారు. 12 అత్యాచారం కేసులు, 23 మహిళల మీద దాడుల కేసులు నమోదయ్యాయి. నాలుగు కిడ్నాప్ కేసులు, పది దోపిడీ కేసులు సైతం ఉన్నాయి. విదేశీయులను దోచుకున్న కేసులైతే 2015లో దేశవ్యాప్తంగా మొత్తం 223 నమోదయ్యాయి.