తీహార్ జైల్లో గ్యాంగ్‌వార్; ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో బుధవారం ఖైదీల మధ్య గ్యాంగ్‌వార్ చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత రేపిన ఈ గ్యాంగ్‌వార్‌లో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జైలు ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
పోలీసు ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం... బుధవారం భోజన విరామం తరువాత కట్టుదిట్టమైన భద్రత మధ్యుండే వార్డుకు చెందిన ఖైదీలు ఈశ్వర్, విజయ్, షాదాబ్ ను జైలు ఆవరణలోని ఆరోగ్య కేంద్రానికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చారు. తిరిగి వార్డు తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. జైలు అధికారులు, పోలీసుల సమక్షంలోనే ఖైదీలు అనిల్, వాసు, సందీప్ పరస్పరం దాడులకు దిగారు. మరోవైపు జైలు నెం. 1, 2 , 4 లకు చెందిన ఖైదీలు కూడా వీరికి జత కలిశారు. దీంతో పరిస్థితి మరింత భయానకంగా మారిపోయింది.
ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన అనిల్(20) ఈశ్వర్(20) అక్కడిక్కడే మరణించారని, సెక్యూరిటీ సిబ్బంది సహా మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి ముఖేష్ ప్రసాద్ తెలిపారు. ఘర్ణణను అదుపు చేసే క్రమంలో జైలు సిబ్బంది కూడా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందించి, పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు.