టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ అదిరింది..
ఖమ్మం : ఖమ్మంలో బుధవారం జరుగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే అతిథుల కోసం పసందైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ,ఆంధ్ర స్టైల్లో వంటకాలను తయారు చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ ఏర్పాట్లను చేస్తున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే నోరూరించే వంటకాలను సైతం సిద్దం చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యేవారికి బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి అల్పాహారాన్ని అందించనున్నారు. పూర్ణం, ఇడ్లీ, వడ, ఉప్మా- పెసరట్టు, పొంగలి, కొబ్బరి చెట్నీ, పల్లీ చెట్నీ, అల్లం చెట్నీ, కారంపొడి, సాంబార్, నెయ్యి, టీ, కాఫీ ఇవ్వనున్నారు.
ప్లీనరీ ప్రారంభమైన వేదికపై ఉన్నవారికి ఉదయం 10 గంటలకు మజ్జిగ, 11 గంటలకు రాగిజొన్న మిక్స్డ్ జావ, మధ్యాహ్నం 2 గంటలకు స్నాక్స్ (బొప్పాయి, ద్రాక్ష పండ్లు) సాయంత్రం 4 గంటలకు టీ లేదా హాట్ బాదం, సాయంత్రం 5 గంటలకు బాసంది అందిస్తారు. ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు నిరంతరం మంచినీరు, ఉదయం 11 గంటలకు మజ్జిగ, సాయంత్రం 3 గంటలకు స్నాక్స్ (మైసూర్‌పాక్, ఆనియన్ పకోడి), సాయంత్రం 4 గంటలకు మజ్జిగ సరఫరా చేస్తారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఇందులో తవ్వా స్వీట్, బెల్లం జిలేబీ, సన్‌రైజ్ ఫుడింగ్, కట్లెట్, గారె, కొత్తిమీర-టమాటా చట్నీ, వెజ్‌టబుల్ బిర్యానీ, పనీర్ కుర్మా, పెరుగు చట్నీ, వైట్‌రైస్, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, వంకాయ పూర్ణం, గుమ్మడికాయ ఇగురు, ముంజల కర్రీ, బీరకాయ శనగపప్పు కర్రీ, మద్రాస్ ఉల్లి చట్నీ, మెంతి మజ్జిగ, పప్పుచారు, ముద్దపప్పు, పచ్చి పులుసు, మిర్యాల రసం, నల్లకారం, నెయ్యి, ఉలవచారు, గుడ్డు, క్రీం, నాటుకోడి పులుసు, మటన్ ధమ్ బిర్యానీ, దాల్చ, గోంగూర మటన్, చింత చిగురు రొయ్యలు, కొర్రమేను పులుసు వంటి 32 రకాల పదార్థాలను అందించనున్నారు.
బ్రెడ్ హల్వా, ఐస్ క్రీం, వెజ్‌రోల్, వైట్‌రైస్, మటన్ కర్రీ, మెంతి చికెన్, గుత్తి వంకాయ, క్యాప్సికం పకోడా ఫ్రై, బీరకాయ, దొండకాయ, రోటీ చట్నీ, పెసరపప్పు టమాట, చీమచింతకాయ ఫ్రై, చామదుంప పులుసు, ముద్దపప్పు, పచ్చి పులుసు, పప్పుచారు, అప్పడం, పెరుగు, నెయ్యి వంటి 18 పదార్థాలను మరో మెనూలో అందించనున్నారు. 12 నుంచి 15 వేల మందికి తగ్గట్లుగా వంటలు తయారుచేస్తున్నారు.