Delist
-
5వేల రెస్టారెంట్లకు షాక్ ఇచ్చిన జొమాటో
ముంబై : అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. నాణ్యతా ప్రమణాలు పాటించని దాదాపు 5 వేల రెస్టారెంట్లను తమ జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపింది. అంతేకాక దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకొన్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని వెల్లడించింది. ఈ విషయం గురించి జొమాటో సీఈవో మోహిత్ గుప్తా మాట్లాడుతూ ‘నిత్యం మా జాబితాలోకి కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం చాలా ముఖ్యం. మాతో సంబంధం ఉన్న దాదాపు 80,000 రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను మరోసారి పరిశీలించాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలను అందుకొనేందుకు సాయం చేస్తామ’ని వెల్లడించారు. -
మాల్యా ‘కింగ్‌ఫిషర్’ అవుట్
ముంబై : బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌పై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ వేటు వేసింది. ఆ కంపెనీని డీలిస్ట్ చేయాలని ఎన్ఎస్ఈ నిర్ణయించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు 17 సంస్థలను మే 30 నుంచి డీలిస్ట్ చేయబోతున్నట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఇంతకు ముందే బీఎస్ఈ 200 కంపెనీలను డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు వీటిని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. అక్రమంగా నిధులు తరలిస్తున్న షెల్ కంపెనీలు, మోసపూరిత కంపెనీలను జాబితా నుంచి తొలగించాలనుకున్న నేపథ్యంలోనే కింగ్‌ఫిషర్‌పైనా వేటు వేస్తున్నట్టు తెలిసింది. 331 అనుమానిత షెల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆగస్టులోని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్టాక్ ఎక్స్ఛేంజీలను ఆదేశించింది. సుదీర్ఘకాలంగా ఎలాంటి వ్యాపార లావాదేవీలు నడవని 2 లక్షల షెల్ కంపెనీలపైనా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. నేడు ఎన్ఎస్ఈ చేస్తున్నట్టు ప్రకటించిన కంపెనీల్లో కింగ్‌షిఫర్‌తో పాటు ప్లెథికో, ఆగ్రో డచ్ ఇండస్ట్రీస్, బ్రాడ్కాస్ట్ ఇన్షియేటివ్స్, క్రెస్ట్ యానిమేషన్ స్టూడియోస్, కేడీఎల్ బయోటెక్, కెమ్రాక్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, లూమ్యాక్స్ ఆటోమోటివ్ సిస్టమ్స్, నిస్సాన్ కాపర్, శ్రీ ఆస్టర్ సిలికేట్స్, సూర్య ఫార్మాస్యూటికల్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. -
200కు పైగా కంపెనీలపై బీఎస్ఈ వేటు
ముంబై : దేశీయ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ భారీగా కంపెనీలపై వేటు వేసింది. 200కి పైగా కంపెనీలను మే 11 నుంచి డీలిస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. డీలిస్ట్ చేసిన ఈ కంపెనీలను ఆరు నెలల పాటు తమ షేర్ల ట్రేడింగ్ జరుగకుండా రద్దు చేసింది. ఈ కంపెనీలను అక్రమంగా ఫండ్ ప్రవాహాలను చేపట్టేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది ఆగస్టులోనే సెబీ 331 అనుమానిత షెల్ కంపెనీలను గుర్తించి, వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఎక్స్చేంజ్లను ఆదేశించింది. అటు ప్రభుత్వం సైతం చాలాకాలంగా కార్యకలాపాలు సాగించని 2 లక్షలకు పైగా సంస్థలను డీరిజిస్ట్రర్ చేసింది. ఈ మేరకు రెండు సర్క్యూలర్లను బీఎస్ఈ జారీచేసింది. వాటిలో ఒక సర్క్యూలర్‌లో 188 కంపెనీలను ఆరు నెలల పాటు ట్రేడింగ్ జరుగకుండా తమ ప్లాట్‌ఫామ్‌పై మే 11 నుంచి డీలిస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. వీటిలో కొన్ని సంస్థలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి కంపల్సరీ డీలిస్ట్ చేస్తున్నట్టు తెలిపింది. మరో 14 సంస్థలను కూడా ఆరు నెలల పాటు రద్దు చేస్తున్నామని మరో సర్క్యూలర్‌లో పేర్కొంది. కంపల్సరీ డీలిస్టింగ్ రెగ్యులేషన్స్ కింద డీలిస్ట్ అయిన పూర్తి కాలపు డైరెక్టర్లు, ప్రమోటర్లను, గ్రూప్ సంస్థను సెక్యురిటీస్ మార్కెట్ యాక్సస్ పొందకుండా పదేళ్ల పాటు రద్దు చేయనుంది. -
200 రాజకీయ పార్టీలకు షాక్?
బ్లాక్‌మనీ కార్యకలాపాలపై కఠినచర్యలలో భాగంగా 200 రాజకీయ పార్టీలపై వేటువేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకి ఎన్నికల సంఘం త్వరలోనే లేఖ రాయనుంది. ఈ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగిస్తున్నాయనే ఆరోపణలతో ఎన్నికల కమిషన్ ఈ 200 పార్టీలను డీలిస్టు చేయాలని సీబీడీటీకి పిలుపునిచ్చింది. ఎన్నికల సీజన్లో రాజకీయ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్నప్పటి నుంచి ఈ పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించాలని సీబీడీటీని కోరింది. దీంతో బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీగా అవతారమెత్తాలని భావించేవారికి చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తూ సీబీటీడీ వాటిని గట్టిగా హెచ్చరిస్తుందని ఎన్నికల సంఘం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పార్టీలకు వెల్లువెత్తే విరాళాలు, వారు వెచ్చిస్తున్న సొమ్ముపై పారదర్శకత కోసం ప్రస్తుత చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఎన్నికల సంఘానికి కేవలం రాజకీయ పార్టీలను నమోదు చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి కల్పించిన స్వాభావిక అధికారాలతో అన్ని ఎన్నికల ప్రవర్తనలను అది నియంత్రిస్తోంది. కానీ పార్టీలను డీలిస్టు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇంకా కల్పించలేదు. సీరియస్‌గా లేని రాజకీయ పార్టీలను డీలిస్టు చేసే అధికారం తమకు కల్పించాలని చాలాసార్లు ఎన్నికల సంఘం గత ప్రభుత్వాలను పలుమార్లు కోరింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకోలేదు. రూ. 20 వేల కంటే ఎక్కువ మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందితే, అందించిన వారి వివరాలను ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్‌లో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కాపీని ఆదాయపు పన్ను శాఖ ప్రతియేటా ఎన్నికల సంఘానికి పంపుతుంది. అయితే చాలా పార్టీలు తమకు రూ.20వేల కంటే ఎక్కువగా అందే విరాళాల వివరాలనే అందించడం లేదు. దీంతో పార్టీ విరాళాల్లో కూడా పారదర్శకత తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. -
14 కంపెనీలను ఎన్ఎస్ఈ డీలిస్ట్
ముంబై : దేశీయ టాప్ మార్కెట్ సూచీ ఎన్ఎస్ఈ తన ప్లాట్‌ఫామ్ నుంచి 14 కంపెనీలను డీలిస్ట్ చేయనుంది. కంపెనీలు తమ సంబంధిత వ్యాపారాలను మూసివేసే ప్రక్రియలో ఉన్నందున ఆగస్టు 31 నుంచి ఆ సంస్థలను ఎన్ఎస్ఈ ట్రేడింగ్ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది. ఎన్ఎస్ఈ తన ప్లాట్‌ఫామ్ నుంచి డీలిస్ట్ చేయబోయే వాటిలో కెమోక్స్ కెమెకిల్ ఇండస్ట్రీస్, గణపతి ఎక్స్‌పోర్ట్స్, హామ్‌కో మైనింగ్ అండ్ స్మెల్టింగ్, మాన్షుక్ ఇండస్ట్రీస్, మార్డియా కెమెకిల్స్, మార్డియా స్టీల్, పాల్ ప్యుగోట్, పొన్ని షుగర్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. ప్రొడెన్షియల్ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్ఐవీ ఇండస్ట్రీస్, వైబ్రెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ కూడా ఈ డీలిస్టెడ్ కంపెనీల జాబితాలో ఉన్నట్టు ఎన్ఎస్ఈ పేర్కొంది. ఈ కంపెనీలు పరిసమాప్తి దశలో ఉన్నందున తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. 2016 ఆగస్టు 31 నుంచి ఈ నిర్ణయం అమలోకి రాబోతుందని ఎన్ఎస్ఈ సర్క్యూలర్ పంపింది. గత ఏప్రిల్‌లో 80 కంపెనీలను సుదీర్ఘకాలం పాటు డీలిస్ట్ చేస్తున్నట్టు ఎన్ఎస్ఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్కెట్ రెగ్యులేటరీ సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కూడా 4200 పైగా కంపెనీలను డీలిస్ట్ చేసే ప్లానింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.