
14 కంపెనీలను ఎన్ఎస్ఈ డీలిస్ట్
ముంబై : దేశీయ టాప్ మార్కెట్ సూచీ ఎన్ఎస్ఈ తన ప్లాట్ఫామ్ నుంచి 14 కంపెనీలను డీలిస్ట్ చేయనుంది. కంపెనీలు తమ సంబంధిత వ్యాపారాలను మూసివేసే ప్రక్రియలో ఉన్నందున ఆగస్టు 31 నుంచి ఆ సంస్థలను ఎన్ఎస్ఈ ట్రేడింగ్ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది. ఎన్ఎస్ఈ తన ప్లాట్ఫామ్ నుంచి డీలిస్ట్ చేయబోయే వాటిలో కెమోక్స్ కెమెకిల్ ఇండస్ట్రీస్, గణపతి ఎక్స్పోర్ట్స్, హామ్కో మైనింగ్ అండ్ స్మెల్టింగ్, మాన్షుక్ ఇండస్ట్రీస్, మార్డియా కెమెకిల్స్, మార్డియా స్టీల్, పాల్ ప్యుగోట్, పొన్ని షుగర్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.
ప్రొడెన్షియల్ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్ఐవీ ఇండస్ట్రీస్, వైబ్రెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ కూడా ఈ డీలిస్టెడ్ కంపెనీల జాబితాలో ఉన్నట్టు ఎన్ఎస్ఈ పేర్కొంది. ఈ కంపెనీలు పరిసమాప్తి దశలో ఉన్నందున తమ ఫ్లాట్ఫామ్ నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. 2016 ఆగస్టు 31 నుంచి ఈ నిర్ణయం అమలోకి రాబోతుందని ఎన్ఎస్ఈ సర్క్యూలర్ పంపింది. గత ఏప్రిల్లో 80 కంపెనీలను సుదీర్ఘకాలం పాటు డీలిస్ట్ చేస్తున్నట్టు ఎన్ఎస్ఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్కెట్ రెగ్యులేటరీ సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కూడా 4200 పైగా కంపెనీలను డీలిస్ట్ చేసే ప్లానింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది.