15 రోజుల్లో అధికారుల విభజన పూర్తి
కేంద్ర పరిపాలనా వ్యవహారాల మంత్రి జితేందర్ సింగ్ వెల్లడి
అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభ్యంతరాలు తెలియజేసిన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ ప్రక్రియ రెండు వారాల్లోగా పూర్తవుతుందని కేంద్ర సిబ్బంది శిక్షణ, పరిపాలనా వ్యవహారాల మంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల కేటాయిం పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ తయారు చేసిన రెండో జాబితాను ఈ నెల 10న డీఓపీటీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై అభ్యంతరాలు వెలవరించేందుకు ఇచ్చిన 15 రోజుల గడువు ముగియడంతో కమిటీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ ప్రత్యూష్‌సిన్హాతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మలు హాజరయ్యారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారుల నుంచి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకుంది. ముసాయిదా జాబితాపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తమ ప్రభుత్వాల అభిప్రాయాలు వెల్లడించారు. అధికారుల విభజన ప్రక్రియ ఆలస్యం అయినందున, రెండో జాబితాలో కేటాయించిన అధికారుల్లో అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికారులను ఆయా రాష్ట్రాలకు ‘ఆర్డర్ టు సర్వ్’ కింద కేటాయించేందుకు సీఎస్‌లు అంగీ కరించినట్లు తెలిసింది. కమిటీకి ఇదే చివరి సమావేశం కావొచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
కోరుకున్న రాష్ట్రానికే కేటాయింపు: కేంద్రమంత్రి
సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన ప్రక్రియ అధికారులందరినీ సంతృప్తి పరిచేలా కొనసాగుతోందని మంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. శనివారం ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్‌లో ఐఏఎస్ అధికారుల మిడ్‌టర్మ్ ట్రైనింగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారుల విభజనకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారుల విభజన ప్రక్రియ చాలా పారదర్శకంగా కొనసాగుతోంది. తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నాం. వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేస్తాం. ప్రతి అధికారిని సంతృప్తి పరిచేలా, అధికారి కోరుకునే రాష్ట్రానికే కేటాయించేలా చూస్తున్నాం. విభజన ప్రక్రియను గరిష్టంగా రెండు వారాల్లో పూర్తి చేయనున్నామన్నారు.
కమలనాథన్ మార్గదర్శకాలకు పీఎం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలోని రాష్ట్ర కేడర్ అధికారుల విభజనకు సంబంధించిన రాష్ట్ర సలహా మం డలి చైర్మన్ సీఆర్ కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. పీఎంవో నుంచి డీవోపీటీకి వచ్చాక వా టిని వెబ్సైట్లో పెట్టనుంది. దీని అనుగుణంగానే విభజన ప్రక్రియను కమిటీ వేగవంతం చేయనుంది.
భార్యాభర్తల కేసైతే ఓకే..!
అఖిల భారత సర్వీసు అధికారుల విజ్ఞాపనలను ప్ర త్యూష్సిన్హా కమిటీ తిరస్కరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. భార్యాభర్తల కేసుల విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంటామని కమిటీ పేర్కొంది.