డెలాయిట్ గ్లోబల్ సీఈవోగా భారతీయుడు
- పునీత్ రంజన్ నియామకం
- జూన్ 1 నుంచి బాధ్యతలు
న్యూయార్క్: అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహించే భారతీయుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గ్లోబల్ సీఈవోగా ప్రవాస భారతీయుడు పునీత్ రంజన్ సోమవారం నియమితులయ్యారు. తద్వారా ఇంద్రా నూయి (పెప్సీకో), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), అన్షు జైన్ (డాయిష్ బ్యాంక్) తదితరుల సరసన ఆయన నిల్చారు.
ప్రస్తుత డెలాయిట్ సీఈవో బ్యారీ సాల్జ్‌బర్గ్ స్థానంలో జూన్ 1 నుంచి రంజన్ బాధ్యతలు చేపడతారు. సీఈవోగా నియామకంపై రంజన్ సంతోషం వ్యక్తం చేశారు. డెలాయిట్‌కి ప్రస్తుతం భారత్ సహా 150 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. రెండు లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలోనే నాలుగు అతి పెద్ద ఆడిటింగ్ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. మిగతావి పీడబ్ల్యూసీ, కేపీఎంజీ, ఈ అండ్ వై. వీటిని ‘బిగ్ ఫోర్’గా పిలుస్తారు.
రంజన్ నేపథ్యమిదీ..
పునీత్ రంజన్.. హరియాణాలోని రోహ్తక్కి చెందినవారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సనావర్‌లో విద్యాభ్యాసం చేశారు. అటు తర్వాత రోటరీ ఫౌండేషన్ స్కాలర్షిప్ దక్కించుకుని పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. విలామెట్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. సుమారు 27 సంవత్సరాలుగా ఆయన డెలాయిట్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం డెలాయిట్ టచ్ తొమాత్సు (డెలాయిట్ గ్లోబల్) డెరైక్టర్‌గాను, డెలాయిట్ ఫౌండేషన్ డెరైక్టర్స్ బోర్డుకు చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు. ఇవి కాకుండా యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, యునెటైడ్ వే వరల్డ్‌వైడ్‌లలో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు.