ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో హెలికాప్టర్ల డిమాండ్ మరింత పెరిగిపోయింది. సాధ్యమైనన్ని ప్రచార సభలు నిర్వహించాలని నాయకుల ప్రణాళికలు రూపొందించుకున్నారు. అందుకు ప్రచార సభలకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లను వినియోగించనున్నారు. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రధాన కూటముల మధ్య పొత్తు విషయం ఎటూ తేలకపోవడంతో సమయం వృథా అయింది.
చివరకు పోత్తు విచ్ఛిన్నం కావడంతో అన్ని పార్టీలు ఒంటరిగా బరిలో దిగాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక్కో రోజుకు జరిగే నాలుగైదు ప్రచారాల సభలో పాల్గొనేందుకు అన్ని పార్టీల కీలక నాయకులకు తగినంత సమయం దొరకడం లేదు. రోడ్డు, రైలు మార్గం కంటే నాయకులు హెలికాప్టర్లనే ఎంచుకుంటున్నారు. విమానాలు, హెలికాప్టర్లు అద్దెకు ఇచ్చే కంపెనీల దిశగా నాయకులు పరుగులు తీస్తున్నారు.
నేడు అన్ని పార్టీల బహిరంగ సభలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీల నాయకుల సోమవారం నుంచి బహిరంగ సభలు, పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రోజు దాదాపు 40 హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు ఆకాశంలో గిరిగిర తిరగనున్నాయి. అందుకు లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వెనకాడే ప్రసక్తే లేదంటున్నారు నాయకులు. కొన్ని పార్టీలు ముందుగానే వాటిని బుక్ చేసుకున్నాయి.
ఎన్సీపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, మాజీ మంత్రులు అజీత్ పవార్, ఆర్.ఆర్.పాటిల్, సునీల్ తట్కరే, కాంగ్రెస్ తరుఫున మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, మాజీ మంత్రులు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మోహన్ ప్రకాశ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ, శివసేనకు చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, తనయుడు ఆదిత్య ఠాక్రే, బీజేపీ తరఫున జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ ఖడ్సే లాంటి దిగ్గజాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రచార సభలకు హెలికాప్టర్లను వినియోగించ డానికి ఆయా పార్టీలు రూపొందించాయి.
అందుకు సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌కు గంటకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షలు, డబుల్ ఇంజిన్ ెహ లికాప్టర్‌కు గంటకు రూ.1.75 లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇవి గంటకు 225 కి.మీ. నుంచి 300 కి.మీ. వేగంతో దూసుకెళతాయి. రాజకీయ నాయకులకు ఒక్కో రోజులో కనీసం నాలుగు బహిరంగా సభల్లో పాల్గొనేందుకు వీలుకానుంది.