భారత విద్యార్థులతో గౌరవంగా వ్యవహరించండి
వాషింగ్టన్: అమెరికాలోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం వ్యవహారంలో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులకు న్యాయ సహాయం అందించాలని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు అధికారుల్ని కోరారు. వీరిపట్ల గౌరవంగా, మానవీయతతో వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, థామస్ సౌజ్జి, రాబ్ వూడల్, బ్రెండా లారెన్స్ తదితరులు హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)తో పాటు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కు లేఖ రాశారు. అమెరికాలో అక్రమ మార్గాల్లో స్థిరపడేందుకు విదేశీయులకు సాయంచేస్తున్న వారిని పట్టుకోవడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు 2017లో ఫార్మింగ్టన్ అనే నకిలీ వర్సిటీని గ్రేటర్ డెట్రాయిట్ ప్రాంతంలో స్థాపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా దాదాపు 129 మంది భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు స్పందిస్తూ.. అరెస్టయిన భారతీయులకు చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పించాలనీ.. తమ న్యాయవాదిని కలుసుకునేందుకు అనుమతించాలని లేఖలో కోరారు.