అధికారుల వెనుకడుగు
పేదల ఇళ్లు కూల్చివేతకు రంగంలోకి దిగిన కార్పొరేషన్ అధికారులు
స్థానికులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్‌యాదవ్
భారీగా పోలీసులు మోహరింపు,
ఎమ్మెల్యే వెనక్కు తగ్గకపోవడంతో ఆక్రమణలు తాత్కాలికంగా విరమించుకున్న అధికారులు
నెల్లూరు, సిటీ:
నగరంలోని 41వ డివిజన్లోని ఉమామహేశ్వరి ఆలయం, పాములమాన్యం ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో ఇళ్లు, దుకాణాలు తొలగించేందుకు నగర పాలక సంస్థ అధికారులు ఆదివారం రంగం సిద్ధం చేశారు. జేసీబీలు, భారీ క్రొక్లేన్‌లను ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రజలు జేసీబీలకు అడ్డుపడటంతో కొంతసేపపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ ఉదయం 6.30 నిమిషాలకు చేరుకున్నారు. ప్రజలు రోడ్డుపై బైఠాయించి మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ తీరుపై మండిపడ్డారు. తాము ఏళ్ల తరబడి ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో నివసిస్తుంటే, ఆక్రమణల పేరుతో కూల్చివేత చేపట్టడంపై ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
4 గంటల పాటు కదలని ఎమ్మెల్యే అనిల్ .
ప్రజల ఇళ్లు కూల్చివేతను అధికారులు చేపడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ తాను ఇక్కడే ఉంటానని, ఆక్రమణల పేరుతో మీ ఇళ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోనని స్థానికులకు హామీ ఇచ్చారు. ఉదయం 4గంటల పాటు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నాయకులు భారీగా చేరుకున్నారు.
తదుపరి చర్యలు ఏమి తీసుకోవాలన్న దానిపై సమీక్ష
పేద ప్రజలకు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ అండగా నిలబడటంతో ఇళ్లు ఏవిధంగా తొలగించాలో అర్థం కాక టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘు, తిమ్మారెడ్డి, కమిషనర్ కె వెంకేటశ్వర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గంటలు గడుస్తున్నా ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లకపోవడంతో అధికారులు ఆక్రమణల తొలగింపు తాత్కాలికంగా వాయిదా వేద్దామని నిర్ణయించుకున్నారు. దీంతో అప్పటికే సిద్ధం చేసిన జీసీబీని, కార్మికులను వెనక్కు పంపారు. అయితే సోమవారం ఆక్రమణల తొలగింపు ఏ విధంగా చేపట్టాలనే దాని పై ఆదివారం సాయంత్రం అధికారులు కార్యాచరణ రూపొందించారు.
పేదల ఇళ్ళు జోలికొస్తే ఎంత దూరమైనా పోరాడతా–సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్
ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లు తొలగిస్తే, వాళ్లు రోడ్డున పడాల్సి వస్తుందని, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సమస్యలు తెలియని జాక్‌పాట్ మంత్రి నారాయణ ఇళ్లను కూల్చేస్తాం, తీసేస్తాం, అనడం తప్ప ఎక్కడా పేద ప్రజలకు అండగా నిలిచిన దాఖలాలు లేవన్నారు. పేదల ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు తొలగిస్తే వారి కోసం వామపక్షాలన్నింటినీ కలుపుకుని పోరాడతానని హెచ్చరించారు.