The demolition of illegal structures
-
ఐదంతస్తుల అక్రమకట్టడం కూల్చివేత
అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా గ్రేటర్ అధికారులు ఐదంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. టోలిచౌకి ప్రాంతం బృందావన్ కాలనీలో ఒక ఐదంతస్తుల భవనాన్ని ఆక్రమిత స్థలంలో నిర్మించినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి జేసీబీలతో చేరుకున్నారు. ఆ భవనాన్ని నేలమట్టం చేయటంపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని, అధికారులతో వాగ్వాదానికి దిగారు. భవనం కూల్చివేతను ఆపాలని గట్టిగా కోరారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే, అధికారులు ససేమిరా మాట వినకపోవటంతో అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. సిబ్బంది కూల్చివేతను కొనసాగిస్తున్నారు. -
19 అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. బుధవారం కాప్రా, ఉప్పల్, సైదాబాద్, ధూల్‌పేట, గుడిమల్కాపూర్, అంబర్‌పేట, ఆదర్శనగర్, రాజేంద్రనగర్, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, సీతాఫల్‌మండీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని 19 భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. గడచిన రెండు రోజులుగా మొత్తం 25 భవనాలను కూల్చివేశారు. ఎవరూ అక్రమ నిర్మాణాలకు పాల్పడవద్దని, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సులభంగా అనుమతులు మంజూరు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు.