డెంగితో బాలిక మృతి
హైదరాబాద్: పాతబస్తీపై డెంగీ పంజా విసురుతుంది. రెండు రోజుల క్రితం నిండు గర్భిణీ మృతి చెందిన వార్త మరువక ముందే మరో చిన్నారీని డెంగీ బలి తీసుకుంది. జంగమ్మెట్కు చెందిన ఆరేళ్ల బాలిక ఆదివారం రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.....జంగమ్మెట్ మార్కెట్ ప్రాంతానికి చెందిన శేఖర్ గౌడ్, వనజ దంపతుల పెద్ద కుమార్తె అక్షయ (6) ఖాద్రీ చమాన్ ప్రాంతంలోని సెయింట్ ఫీటర్ పాఠశాలలో ఒకటో తరగతి విద్యనభ్యసిస్తుంది.
ఐదు రోజుల నుంచి బాలిక అనారోగ్యంతో బాధ పడుతుండడంతో శేఖర్ స్థానికంగా ఉన్న ఆసుపత్రులలో చికిత్స చేయించాడు. అయినప్పటికీ జ్వరం నయం కాకపోవడంతో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకె ళ్లాడు. మొదట టైపాయిడ్, మలేరియా అంటూ చెప్పుకొచ్చిన వైద్యులు చేతులెత్తేయడంతో చివరకు మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలోని నైస్ ఆసుపత్రికి శనివారం తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన అక్షయ ఆదివారం రాత్రి మృతి చెందింది. డెంగీ కారణంగానే అక్షయ మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు మరణ దృవీకరణ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. కాగా బాలిక తండ్రి శేఖర్ పండ్ల అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు.