లలిత్ మోదీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: ఈడీ విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి భారీ ఊరట లభించింది. లలిత్ మోదీపై రెడ్ నోటీసు జారీ చేయాలన్న భారత్ విన్నపాన్ని ఇంటర్‌పోల్ తిరస్కరించింది. మోదీని తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన విషయంలో ఇంటర్‌పోల్ ఆయన్ను అరెస్ట్ చేయదు.
ఐపీఎల్ చైర్మన్ హోదాలో లలిత్ మోదీ అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. లండన్‌లో ఉంటున్న మోదీ భారత్‌లో తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల విచారణకు రాలేనంటూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లలిత్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఇంటర్‌పోల్ సాయం కోరింది. అయితే భారత్ విన్నపాన్ని ఇంటర్‌పోల్ తిరస్కరించింది.