తాటి తేగలూ ఆదాయ వనరులే!
తాటి పండు నుంచి లభించే ఉత్పత్తుల్లో తేగలు ముఖ్యమైనవి. పలు పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న తేగలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. తేగల పిండి తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చునంటున్నారు పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన ఆహార-సాంకేతిక విజ్ఞాన శాస్త్రవేత్త పిసి వెంగయ్య.
తాటి టెంక నుంచి 21-30 రోజుల్లో మొలక వస్తుంది. ఈ మొలక భూమిలోకి దాదాపు 45-60 సెం. మీ. పోతుంది. మొలక వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలకు ఏర్పడే దానిని తేగ అంటారు. తేగ పెరిగే కొద్దీ కొబ్బరిలా గట్టిగా ఉండే పదార్థం కరిగిపోతుంది. ఇది దాదాపు 6-12 నెలలు అంటే తేగ నుంచి మొక్క వచ్చే వరకు ఉపయోగపడుతుంది. టెంకలను నీడలో పాతర పెడితే తేగలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. విత్తనం నుంచి మొక్క రావటం అనేది 50 శాతం వరకు ఉంటుంది.
గుజ్జు తీసిన టెంకలు తొందరగా మొలక వ చ్చి బాగా పెరుగుతాయి. పెద్ద టెంకల నుంచి మందం గల తేగలు చిన్న టెంకల నుంచి సన్న తేగలు వస్తాయి. పొడవులో మాత్రం వ్యత్యాసం ఉండదు. టెంకలను వరుసల మీద అమర్చటం ద్వారా కూడా తేగలు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఈ వరసలు నాలుగు కంటే ఎక్కువగా ఉండకూడదు. తేగల ఉత్పత్తిలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.
తేగల పిండి తయారీ ఇలా...
తాజా తేగలను శుభ్రపరచి ఒక అరగంట పాటు ఉడికించి అమ్మవచ్చు. వీటిలో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. పచ్చి తేగలను లేదా ఉడికించిన తేగలను రెండుగా విడదీసి ఆరబెట్ట వచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టటం మరో పద్ధతి. వీటిలో ఏదో ఒక విధానంలో తేగలను పిండిగా మార్చవచ్చు. తేగను పిండి రూపంలోకి మార్చి 250 మైక్రాన్ల జల్లెడ ద్వారా జల్లిస్తారు.
పచ్చి పిండిని వాడేటప్పుడు ఒకట్రెండు గంటలు నీటిలో నానబె డితే చేదు పోతుంది. పిండి నుంచి నీటిని తొలగించేందుకు వడపోయాలి. లేదా వేడి చేయాలి.
తేగల పిండితో పలు వంటకాల తయారీ ...
పిండిని ఉడికించడం ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు చేయవచ్చు. ఉడికించిన పిండిలో బెల్లం, కొబ్బరి పొడి కలిపి తినవచ్చు. ఈ పిండిలో కొబ్బరిపొడి కలిపి ఆవిరితో ఉడికిస్తే మంచి రుచికరమైన వంటకం తయారవుతుంది. మినపప్పుతో కలిపి ఇడ్లీ, దోశె తయారు చేయవచ్చు. బ్రెడ్, గోధుమ పిండితో కలిపి నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి, గోధుమ పిండితో తయారు చేసే అన్ని వంటకాల్లోను దీన్ని వాడవచ్చు.
తాజా తేగ 46 గ్రా. బరువుంటుంది. ఉడికించి ఆరబెట్టినది 16. గ్రా., పచ్చిది ఆరబెట్టినది 18గ్రా. బరువుంటుంది. సుమారు 60 శాతం పిండి పదార్థం ఉంటుంది. తేగల్లో ముఖ్యమైనది పిండి పదార్థం. ఇది తేగ మొదటి భాగంలో ఎక్కువగా ఉంటుంది. పోనుపోను తగ్గుతూ ఉంటుంది. తాజా తేగలో సుమారు 55 శాతం తేమ ఉంటుంది. ప్రొటీన్లు 5 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం ఉంటాయి.
( వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరి మామిడి పరిశోధనా స్థానం ఆహార - సాంకేతిక విభాగం శాస్త్రవేత్త వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు)
ప్రాచీన వర్షాధార సేద్య పద్ధతిపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం
ప్రాచీన కాలం నుంచి కర్ణాటకలో వాడుకలో ఉన్న అటవీ వ్యవసాయ విధానం ‘కడు కృషి’.
ప్రముఖ శాస్త్రవేత్త డా. ఖాదర్ ఈ పద్ధతిని పునరుద్ధరించి, రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా (కాబిని డ్యాం దగ్గర) బీదరహళ్లిలోని హెచ్డి కోటే హ్యాండ్పోస్ట్ వ్యవసాయ క్షేత్రంలో నవంబర్ 12, 13 తేదీల్లో శిక్షణా శిబిరం జరుగుతుంది.
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజంగా పంటలు సాగు చేయడం ఈ కడు కృషి విధానం ప్రత్యేకత. ముఖ్యంగా ఈ విధానం కరవు, మెట్ట ప్రాంతాల్లో వర్షాధార సేద్యం చేసే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. భూసారాన్ని పెంపొందించే సహజ క్రిమినాశనులు, మొక్కల సహజ పెరుగుదలకు ఉపకరించే ద్రావణాలు, సహజ ఎరువుల తయారీపై డా. ఖాదర్ శిక్షణ ఇస్తారు. భూగర్భజలాల పరిరక్షణ పద్ధతులు, చిరుధాన్యాల సాగు, చిరుధాన్యాల వల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరిస్తారు.
నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే శిక్షణ 13వ తేదీ ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. నవంబర్ 5లోగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 097422 58739 నంబరులో వాట్స్యాప్ ద్వారా సంప్రదించవచ్చు.