కొనసాగుతున్న ‘టెన్త్’ లీక్
పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్‌లో సోషల్–1 పేపర్
కడప ఎడ్యుకేషన్/కాశినాయన/ పోరుమామిళ్ల: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం జరిగిన సోషల్ పేపర్–1 ప్రశ్నపత్రం కూడా లీకైంది. ఉదయం 10 గంటలకల్లా వాట్సాప్‌లో ప్రశ్నపత్రం దర్శనమివ్వడంతో జిల్లాలో కలకలం రేగింది. వైఎస్సార్ జిల్లా నరసాపురంలోని పరీక్ష కేంద్రం నుంచి ఈ ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రం ఆధారంగా పలు కేంద్రాలకు బయట నుంచి సమాధానాలు పంపించినట్లు సమాచారం. దీనిపై డీఈవో శైలజను వివరణ కోరగా.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు నరసాపురం పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. చీఫ్ సూపరింటెండెంట్ సుబ్బారావు, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఇన్విజిలేటర్లను విచారిస్తున్నారు.
విలేకరిపై పోలీసు జులుం: నరసాపురం పరీక్షా కేంద్రం నుంచి సోషల్–1 ప్రశ్నపత్రం లీక్ అయ్యిందం టూ ఓ చానల్(సాక్షి కాదు)లో ఉదయం 9.45 గంటలకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దీంతో పోరుమామిళ్ల వచ్చిన మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు.. ఆ చానల్ విలేకరి గోపాల్‌రెడ్డిని స్టేషన్‌కు పిలిపించారు. ప్రశ్నపత్రం ఎలా బయటకొచ్చింది? అసలు ఆ పేపర్ నీ చేతికి ఎలా వచ్చింది? అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ఎస్సై పెద్ద ఓబన్న అయితే ఏకంగా విలేకరి నుంచి ఫోన్ లాగేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన స్థానిక విలేకరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో గోపాల్‌రెడ్డిని వదిలివేశారు. కానీ అతని ఫోన్ మాత్రం వారి వద్దే అట్టిపెట్టుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ విలేకరులంతా స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ఎస్సై ఓబన్న బయటకు వచ్చి విలేకరులకు సర్ది చెప్పారు.
సోషల్ పేపర్–2 ప్రశ్నపత్రం కూడా లీక్!
సాక్షి కడప: ఈనెల 30(గురువారం)న నిర్వహించాల్సిన సోషల్ పేపర్–2 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం సైతం లీకైనట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రం మంగళవారమే బ్రహ్మంగారి మఠం మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చేరినట్లు తెలియడంతో పోలీసులు ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.