దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘బి’
విశాఖపట్నం: దేవధర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ‘బి’ జట్టు వరుసగా రెండో విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. మనీశ్ పాండే (110 బంతుల్లో 104; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టడంతో... ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘బి’ జట్టు 32 పరుగుల తేడాతో విజయ్ హజారే ట్రోఫీ విజేత తమిళనాడుపై విజయం సాధించింది. ఇక్కడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ ‘బి’ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ (48 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించాడు.
తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత తమిళనాడు 48.4 ఓవర్లలో 284 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ కౌషిక్ గాంధీ (134 బంతుల్లో 124; 9 ఫోర్లు) వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించేందుకు విఫలప్రయత్నం చేశాడు. జగదీశన్ (64; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ధవల్ కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో 3 వికెట్లు తీశారు. హైదరాబాద్ ఆటగాడు సీవీ మిలింద్కు 2 వికెట్లు దక్కాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో తమిళనాడు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు బుధవారం జరిగే ఫైనల్లో భారత్ ‘బి’తో తలపడుతుంది.