బడ్జెట్ తర్వాత డిజిన్వెస్ట్మెంట్ దూకుడు!
న్యూఢిల్లీ: బడ్జెట్ తర్వాత పీఎస్యూల్లో వాటా విక్రయాలకు సంబంధించి కసరత్తు మొత్తం పూర్తిచేయాలంటూ డిజిన్వెస్ట్మెంట్ విభాగాన్ని(డీఓడీ) ఆర్థిక శాఖ ఆదేశించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో బుల్ జోరు నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్కారు యోచిస్తోంది. 2014-15 మధ్యంతర బడ్జెట్లో అప్పటి యూపీఏ ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.36,925 కోట్లుగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
వచ్చే నెలలో మోడీ సర్కారు ప్రవేశ పెట్టనున్న తొలి బడ్జెట్లో కూడా ఈ లక్ష్యాన్ని యథావిధిగా కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల జోరుతో చాలా పీఎస్యూల షేర్ల విలువలు భారీగానే ఎగబాకాయి. దీంతో వాటా విక్రయాలతో ప్రభుత్వానికి కూడా తగిన రాబడి వచ్చేందుకు వీలుంది. బడ్జెట్ తర్వాత డిజిన్వెస్ట్మెంట్కు సమాయత్తమవుతున్నాం’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి
. కోల్ ఇండియా(10 శాతం వాటా విక్రయం), సెయిల్(10%), ఎన్హెచ్పీసీ(11.6%), ఆర్ఈసీ(5%), పీఎఫ్సీ(%) వంటివి ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ జాబితాలో ఉన్నాయి. కాగా, చాన్నాళ్లుగా పెండింగ్లోఉన్న హిందుస్థాన్ జింక్, బాల్కోలలో అవశేష(స్వల్పంగా మిగిలిన) వాటాను కూడా విక్రయించేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిద్వారా రూ.15,000 కోట్లు ఖజానాకు జమకావచ్చని అం చనా. తాజాగా ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్యూల వాటా విక్రయ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని డీఓడీని జైట్లీ ఆదేశించినట్లు సమాచారం.