Department of Justice Employees
-
న్యాయాధికారులకు సెలవులివ్వొద్దు
- జిల్లా, సెషన్స్ జడ్జీలకు హైకోర్టు ఆదేశం - వారి సెలవుల అధికారాల ఉపసంహరణ - న్యాయాధికారుల మూకుమ్మడి సెలవులనేపథ్యంలో ఉత్తర్వులు - విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: క్రమశిక్షణ, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ గత రెండ్రోజులుగా తెలంగాణ న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ వచ్చిన హైకోర్టు బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్, సీనియర్ సివిల్ జడ్జీలకు సెలవుల మంజూ రుకు సంబంధించి జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీలకున్న అధికారాలను ఉపసంహరించింది. మూకుమ్మడి సెలవులు పెడుతున్న న్యాయాధికారులకు అడ్డుకట్ట వేసేందుకు హైకోర్టు ఈ చర్య చేపట్టింది. తక్షణమే ఈ ఉపసంహరణ అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఉపసంహరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉభయ రాష్ట్రాల న్యాయాధికారులెవరూ తమ అనుమతి లేకుండా ఏ రకమైన సెలవు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సెలవులకు సంబంధించిన దరఖాస్తులు అందుకుంటే వాటిని ఫ్యాక్స్ ద్వారా తమకు పంపాలని జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెష న్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీలను ఆదేశించింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ (విజిలెన్స్) పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల బహిష్కరణ నామమాత్రం... న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితా ఉపసంహరణ, న్యాయాధికారుల సస్పెన్షన్ ఎత్తివేత డిమాండ్లతో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ నామమాత్రంగా సాగింది. ఏ కోర్టు విధులకూ ఆటంకం కలగలేదు. విధుల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో హైకోర్టులో భారీగా పోలీ సు బలగాలు మోహరించాయి. హైకోర్టుకు వచ్చే ప్రధానమార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూసేశారు. దీంతో ఆ ప్రాం తం లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోర్టుల కేసుల విచారణ జాబితాలో పేర్లున్న న్యాయవాదులనే కోర్టు లోపలకు అనుమతించారు. కోర్టు లోపలకు చొచ్చుకొచ్చేందుకు యత్నిం చిన 45 మంది న్యాయవాదులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడిచిపెట్టారు. హైకోర్టు లోపలకు వచ్చిన టిన్యాయవాదులు న్యాయవాద బ్యాండ్లు తొలగించి నిరసన తెలియచేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే కూర్చొనే మొదట కోర్టు హాలు వద్ద బుధవారం కూడా భారీగా పోలీసులు మోహరిం చారు. ఏసీజే చాంబర్‌కు వెళ్లే దారులనూ మూసేశారు. అన్ని కోర్టుల్లో విధులు సాయంత్రం వరకు సజావుగా సాగిపోయాయి. ఏపీ అధికారులకు భద్రత కల్పించాలి.. వరంగల్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయాధికారిపై అక్కడి న్యాయవాదులు దాడికి పాల్పడటంతోపాటు అసభ్య పదజాలంతో దూషిం చడాన్ని ఉమ్మడి బార్ కౌన్సిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఖండించారు. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ఏపీకి చెందిన న్యాయాధికారులందరికీ భద్రత కల్పించాలని ఏసీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలేను కోరారు. ఏసీజేను కలిసిన వారిలో గంటా రామారావు, కనకమేడల రవీంద్రకుమార్, ఎస్.కృష్ణమోహన్, వి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. న్యాయఉద్యోగుల సమ్మెకు టీఎన్జీవోల మద్దతు న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రద్దు చేయడంతోపాటు న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయకుంటే సకల జనుల సమ్మెకూ వెనుకాడబోమని గెజిటెడ్, టీఎన్జీవో సంఘం నేతలు హెచ్చరించారు. న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టు న్యాయశాఖ ఉద్యోగులు బుధవారం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవో గౌరవ అధ్యక్షుడు దేవీశ్రీ ప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డితోపాటు పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. జూలై 1 నుంచి జరిగే న్యాయశాఖ ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని, స్థానికత ఆధారంగానే న్యాయాధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని నిలబెడదాం
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ తలుపుతట్టే కక్షిదారులతో ప్రేమగా మాట్లాడి, వారి సమస్య పరిష్కారం అయ్యే దిశగా మార్గనిర్దేశనం చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలే న్యాయశాఖ ఉద్యోగులకు సూచించారు. ఆదివారం నగరంలో జరిగిన అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ సదస్సుకు జస్టిస్ బొసాలే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయమూర్తులు, ఉద్యోగులు, సిబ్బంది కలిపితే న్యాయవ్యవస్థ అని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలూ విఫలమైన తర్వాత చిట్టచివరి ఆశగా ప్రజలు న్యాయవ్యవస్థ వద్దకు వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతే అది అరాచకానికి దారి తీస్తుందని... ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎలాగైనా నిలబెట్టాలని ఉద్యోగులకు సూచించారు. ప్రతి మనిషి విజయం వెనుక మహిళ ఉంటే...న్యాయమూర్తుల విజయం వెనుక నిరంతరం కష్టించే ఉద్యోగులు, సిబ్బంది ఉంటారని ప్రశంసించారు. న్యాయమూర్తులు సమర్థవంతంగా తీర్పులు వెలువరించడంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎంతోమంది ఉద్యోగులు కోర్టు వేళలు ముగిసిన తర్వాత కూడా పనిచేస్తున్నారని, కేసుల జాబితా రూపొందించడంతోపాటు న్యాయమూర్తులకు కేసు ఫైళ్లను చేరవేస్తున్నారని ప్రశంసించారు. న్యాయశాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం జస్టిస్ జగన్నాథశెట్టి కమిషన్ చేసిన సిఫార్సుల్లో దేశంలోనే మొదటిసారిగా ఉమ్మడి హైకోర్టు చాలావాటిని అమలు చేసిందని తెలిపారు. అమలుకు నోచుకోని మరిన్ని సిఫార్సులను కూడా త్వరలోనే అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చిన తర్వాత సర్టిఫైడ్ కాపీలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని... కక్షిదారులకు ఇబ్బంది కలగకుండా ఉద్యోగులు చూసుకోవాలని సూచించారు. న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, న్యాయమూర్తులతో కలసి ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం అందించాలని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి అన్నారు. సహనం, శాంత స్వభావంతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని... న్యాయశాఖ ఉద్యోగులు ఈ రెండు లక్షణాలను అలవర్చుకోవాలని జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుతో పోలిస్తే న్యాయశాఖ ఉద్యోగుల పనితీరు భిన్నంగా ఉంటుందని, జస్టిస్ జగన్నాథశెట్టి కమిషన్ సిఫార్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ షకీల్‌అహ్మద్ మోయిన్ అన్నారు. న్యాయవ్యవస్థ సున్నితంగా నడవడం వెనుక ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని, న్యాయమూర్తుల తరహాలోనే ఉద్యోగులు, సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించాలని సంఘం జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బోద లక్ష్మారెడ్డి అన్నారు. తమ సంఘం కృషి ఫలితంగానే అన్ని రాష్ట్రాలు శెట్టి కమిషన్ సిఫార్పులు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. సమావేశంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని, హైకోర్టు రిజిస్ట్రార్ ముత్యాలనాయుడు, ఏపీ, టీఎస్ రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, గోపీనాథ్‌రెడ్డి, జగన్నాథం, రాజశేఖర్‌రెడ్డి, నేతలు సురేశ్‌శర్మ, సురేశ్ ఠాకూర్, శ్రీధర్‌రావు, సుబ్బయ్య, నల్లారెడ్డి, కృష్ణనాయక్, రాజిరెడ్డి, నరసింహారెడ్డి, సుబ్రమణ్యంలతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శిగా లక్ష్మారెడ్డి అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బోద లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలో నిర్వహించిన జాతీయ సదస్సులో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ప్రధాన కార్యదర్శిగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1983లో న్యాయశాఖలో చేరిన లక్ష్మారెడ్డి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి శెట్టి కమిషన్ సిఫార్సుల అమలు కోసం కృషి చేశారు.