న్యాయాధికారులకు సెలవులివ్వొద్దు
- జిల్లా, సెషన్స్ జడ్జీలకు హైకోర్టు ఆదేశం
- వారి సెలవుల అధికారాల ఉపసంహరణ
- న్యాయాధికారుల మూకుమ్మడి సెలవులనేపథ్యంలో ఉత్తర్వులు
- విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: క్రమశిక్షణ, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ గత రెండ్రోజులుగా తెలంగాణ న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ వచ్చిన హైకోర్టు బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్, సీనియర్ సివిల్ జడ్జీలకు సెలవుల మంజూ రుకు సంబంధించి జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీలకున్న అధికారాలను ఉపసంహరించింది. మూకుమ్మడి సెలవులు పెడుతున్న న్యాయాధికారులకు అడ్డుకట్ట వేసేందుకు హైకోర్టు ఈ చర్య చేపట్టింది.
తక్షణమే ఈ ఉపసంహరణ అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఉపసంహరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉభయ రాష్ట్రాల న్యాయాధికారులెవరూ తమ అనుమతి లేకుండా ఏ రకమైన సెలవు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సెలవులకు సంబంధించిన దరఖాస్తులు అందుకుంటే వాటిని ఫ్యాక్స్ ద్వారా తమకు పంపాలని జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెష న్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీలను ఆదేశించింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ (విజిలెన్స్) పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.
విధుల బహిష్కరణ నామమాత్రం...
న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితా ఉపసంహరణ, న్యాయాధికారుల సస్పెన్షన్ ఎత్తివేత డిమాండ్‌లతో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ నామమాత్రంగా సాగింది. ఏ కోర్టు విధులకూ ఆటంకం కలగలేదు. విధుల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో హైకోర్టులో భారీగా పోలీ సు బలగాలు మోహరించాయి. హైకోర్టుకు వచ్చే ప్రధానమార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూసేశారు. దీంతో ఆ ప్రాం తం లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోర్టుల కేసుల విచారణ జాబితాలో పేర్లున్న న్యాయవాదులనే కోర్టు లోపలకు అనుమతించారు. కోర్టు లోపలకు చొచ్చుకొచ్చేందుకు యత్నిం చిన 45 మంది న్యాయవాదులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడిచిపెట్టారు. హైకోర్టు లోపలకు వచ్చిన టిన్యాయవాదులు న్యాయవాద బ్యాండ్లు తొలగించి నిరసన తెలియచేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే కూర్చొనే మొదట కోర్టు హాలు వద్ద బుధవారం కూడా భారీగా పోలీసులు మోహరిం చారు. ఏసీజే చాంబర్‌కు వెళ్లే దారులనూ మూసేశారు. అన్ని కోర్టుల్లో విధులు సాయంత్రం వరకు సజావుగా సాగిపోయాయి.
ఏపీ అధికారులకు భద్రత కల్పించాలి..
వరంగల్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయాధికారిపై అక్కడి న్యాయవాదులు దాడికి పాల్పడటంతోపాటు అసభ్య పదజాలంతో దూషిం చడాన్ని ఉమ్మడి బార్ కౌన్సిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఖండించారు. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ఏపీకి చెందిన న్యాయాధికారులందరికీ భద్రత కల్పించాలని ఏసీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలేను కోరారు. ఏసీజేను కలిసిన వారిలో గంటా రామారావు, కనకమేడల రవీంద్రకుమార్, ఎస్.కృష్ణమోహన్, వి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
న్యాయఉద్యోగుల సమ్మెకు టీఎన్జీవోల మద్దతు
న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రద్దు చేయడంతోపాటు న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయకుంటే సకల జనుల సమ్మెకూ వెనుకాడబోమని గెజిటెడ్, టీఎన్జీవో సంఘం నేతలు హెచ్చరించారు. న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టు న్యాయశాఖ ఉద్యోగులు బుధవారం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవో గౌరవ అధ్యక్షుడు దేవీశ్రీ ప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డితోపాటు పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. జూలై 1 నుంచి జరిగే న్యాయశాఖ ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని, స్థానికత ఆధారంగానే న్యాయాధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.