400 మంది కూలీలు ఏమయ్యారో?
గుమ్మఘట్ట: ఉపాధి కోసం విశాఖపట్టణంకు వలస వెళ్లిన గుమ్మఘట్ట మండలంలోని గోనబావి, పూలకుంట గ్రామాలకు చెందిన వందలాది మంది వలస కూలీల ఆచూకీ తెలియక ఇక్కడి వారి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని నెల క్రితమే సుమారు నాలుగు వందల మందికి పైగా కూలీలు విశాఖపట్టణంలో కెబుల్ వైర్ ట్రెంచింగ్ పనుల కోసం తరలివెళ్లారు.
ఇటీవల తుఫాను వారిజీవితాల్లో కలకలం లేపడంతో కలసి పనిచేస్తున్న వారంతా తలదాచుకునేందుకు తలోదిక్కుకువెళ్లిపోయారు. పిల్లపాపలు సైతం విడిపోయి ఎవరెక్కడున్నారో తెలియక, ఏ క్షణం ఎలాంటి విషాదం వినాల్సివస్తోందోనని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. మేస్త్రీలకు ఫోన్ చేస్తుంటే సరైన సమాధానం రావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. రవాణ, సమాచార వ్యవస్థ దెబ్బ తినడంతో ఐదు రోజులుగా తమ వారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదని దిగాలు పడుతున్నారు.
విశాఖలోని ఆర్కే బీచ్, గాజువాక, ఆటోనగర్, కైలాసగిరి కొండ తదితర ప్రాంతాల్లో ట్రెంచింగ్ పనులు చేస్తున్నట్లు అక్కడ కూలీలు గత వారం క్రితమే తెలిపారని గ్రామస్తులు గంగమ్మ, గోవిందమ్మ వివరించారు. అక్కడ పని చేస్తున్న మేస్త్రీ మానేకొట వెంకటశులకు చెందిన ఫోన్ బుధవారం లైన్ కలవడంతో కొంత సమాచారం చేరవేశారు. గుడారాలే కాక తిండి వస్తువులు, బట్టలు, వెంట తీసుకెళ్లిన పనిముట్లు కూడా తుఫాను బీభత్సానికి కొట్టుకుపోయాయని వివరించారు.
నాలుగైదు రోజులుగా నిద్రాహారాలు మాని అష్టకష్టాల్లో ఉన్నట్లు మేస్త్రీ చెప్పినట్లు బాధితుల బంధువులు వివరించారు. గోనబావి, పూలకుంట గ్రామాల్లో పెద్ద మొత్తంలో విశాఖకు వలసెళ్లడంతో ఎటుచూసిన ఇళ్లకు తాళాలు, నిర్మానుష్య వాతావరణం నెలకొంది. ప్రభుత్వం తక్షణం స్పందించి తుఫానులో చిక్కుకున్న తమ బంధువులను గ్రామాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎలా ఉన్నారో.. - గంగమ్మ, గోనబావి గ్రామస్థురాలు
తుఫానులో చిక్కుకుని నిరాశ్రయులైన తమ నలుగురు కుమారులు, కోడళ్లు, పిల్లలు ఎలా ఉన్నారో ఐదు రోజులుగా ఆచూకి తెలియడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన మా పిల్లలు అక్కడ ఉప వాసం ఉంటుంటే ఇక్కడ మాకు ముద్ద దిగడం లేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మా ఊరోళ్లందరినీ క్షేమంగా ఇంటికి చేర్చాలి.
ప్రభుత్వమే రవాణ సదుపాయం కల్పించాలి- గోవిందమ్మ, గోనబావి గ్రామస్థురాలు
తుఫానులో చిక్కుకున్న మా వారిని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఇక్కడకు తీసుకురావాలి. తిండితిప్పలు లేక అక్కడ అల్లాడుతున్నట్లు మాకు తెలిసింది. కొంత మంది పిల్లలు తప్పిపోయినారంట. వాళ్లక్కడ ఎలా ఉన్నారో తెలియడం లేదు. ఫోన్లు కలవడం లేదు. మాకు భయం వేస్తోంది. అధికారులు వెంటనే స్పందించి వాళ్లను ఇక్కడకు తీసుకురావాలి.