నిక్కచ్చే నా పనితీరు..ప్రజల కోసమే పనిచేస్తా:మహమూద్ అలీ
‘సాక్షి’తో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు కోట్లు ఖర్చవుతున్న ఈ రోజుల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తానీ పదవిలోకి వచ్చినట్టు, అలాగే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ చెప్పారు. ఎమ్మెల్యేల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికకావడం, ఉప ముఖ్యమంత్రిగా నియమితులవడంతోపాటు కీలకమైన రెవెన్యూ శాఖ రావడం తన పూర్వ పుణ్యఫలమన్నారు. ఒక్కరూపాయి ముట్టుకోకుండా, అట్టడుగు ప్రజల కోసం, నిజాయతీగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేకాంశాలను ప్రస్తావించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఆరునెలలు ఆగండి...
రాష్ట్రవిభజన నేపథ్యంలో ఇంకా పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటు కాలేదు. ఇప్పటిదాకా ఉన్నతాధికారులతో మాట్లాడగా, రెవెన్యూశాఖలో వేల సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించడంపై అధ్యయనం చేస్తున్నాం. భూముల సర్వే నంబర్లు, వాటికి హద్దులు వంటివాటిపై రీసర్వే నిర్వహిస్తాం. ఎప్పుడో 80 ఏళ్ల కింద నిజాం కాలంలో సర్వే జరిగింది. ముందుగా అన్ని గ్రామాల్లో రీసర్వే చేసి, 100 శాతం కచ్చితమైన రికార్డులను తయారుచేస్తాం. దీనితో ప్రభుత్వ భూ ముల కబ్జాలు, వ్యక్తుల మధ్య భూ తగాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. 60 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటే 100 ఏళ్ల రికార్డులు అడుగుతున్నారు. పుట్టకముందు నుంచీ రికార్డులు అడిగితే ఎక్కడి నుండి తెస్తారు? వీటిని సులభతరం చేస్తాం. భూములకు ప్రభుత్వం నిర్ధారించిన ధరలు కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ధరల కంటే చాలా ఎక్కువగా ఉం డగా.. మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నాయి. మండల స్థాయి లో నివేదికలు తెప్పించి సవరిస్తాం. ఆరునెలలు ఆగాలి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కబ్జాలపై ఉక్కుపాదం
అతివిలువైన భూములున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1,700 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయినటు చెబుతున్నా రు. ఇతర జిల్లాల్లోని వక్ఫ్, దేవాలయ భూములను కూడా కబ్జాదారుల నుండి కాపాడుతాం. కబ్జా చేసిన వారెంతటి పలుకుబడి కలిగిన వారైనా ఉక్కుపాదం మోపుతాం.
మొక్కుబడి ఇళ్లు కాదు.. బ్రహ్మాండమైన కాలనీలు..
టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు 120 గజాల జాగాలో రెండు బెడ్రూములతో ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్తు, విశాలమైన రహదారులతో ఏర్పాటుచేస్తాం.
రెండేళ్లలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ
తెలంగాణలో జిల్లాలను 24 జిల్లాలకు పెంచుతాం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రణాళికలు వేశారు. ఇప్పుడు 25-30 లక్షల జనాభాకు మించిన జిల్లాలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వసేవలు కిందిస్థాయికి చేరడంలేదు. సుమా రు 15 లక్షల మందికి ఒక జిల్లా ఉండే విధంగా రెండేళ్లలోగా జిల్లాల పునర్విభజనను పూర్తిచేస్తాం.
పదవి కొంటే.. పైసలెట్ల వసూలు చేస్తవో చెప్పు?
మొన్న ఒకాయన వచ్చి ఓ కార్పొరేషన్ పదవి కావాలని అడిగిండు. నాకు అర్థంకాక.. ‘పార్టీలో 14 ఏళ్ల నుంచి ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన వాళ్లున్నరు. పార్టీలో పనిచేయని వాళ్లకు పదవులు ఎలా వస్తయి?..’ అని అడిగిన. దానితో ఆయన నవ్వి ‘రెండు కోట్లు ఇస్తా..’ అని ఆశపెట్టిండు. నాకు చాలా ఆశ్చర్యం వేసి.. ‘నాకు రెండు కోట్లు ఇస్తనంటున్నవు. వాటిని ఎవరిదగ్గర వసూలు చేస్తవో లిస్టు కూడా ఇవ్వు. ఎవరి దగ్గర, ఎందుకు, ఎట్లా వసూలు చేసుకుంటవో చెప్తే ఆ లిస్టును కేసీఆర్కు చూపిస్త. ఆయనకు నచ్చితే నీకు ఇస్తడేమో..’ అని చెప్పిన. దానితో గమ్మున వెళ్లిపోయిండు. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుంటనే ఎమ్మెల్సీ అయిన, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన. దేవుని దయ వల్ల ఇబ్బందులు లేవు. నాతోని అయ్యే పనికి ఒక్క రూపాయి కూడా లేకుంట పనిచేస్తా.
చెప్పులకు 80 వేల రూపాయలట..!
నేను ఉప ముఖ్యమంత్రిని అయిన్నని అభినందించడానికి నా దగ్గరి మిత్రుడొకడు మొన్న వచ్చాడు. మంచీచెడూ మాట్లాడుకున్నంక పోతుంటే సాగనంపడానికి నేనూ బయటకు వచ్చిన. అప్పుడు చెప్పులేసుకుంటుంటే వాటిని నా మిత్రుడు చూస్తూ ‘నిన్న మొన్నటిదాకా ఏ చెప్పులేసుకున్నా నడిచింది. ఇప్పుడు నువు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి. మన బస్తీకి ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్లు తొడుక్కుంటున్న చెప్పులెప్పుడన్న సూసినవా? 70-80 వేలు పెట్టి దుబాయి నుండి తెప్పించుకుంటరు. 50 వేలకు తక్కువగా ఉన్న చెప్పులు ఎప్పుడూ తొడుక్కోరు. వాళ్ల కన్నా ఎక్కువగా మెయిన్టేన్ చెయ్యాలె’ అని అన్నడు. ‘చెప్పులు కాళ్లకు రక్షణగా ఉండాలె. నలుగుర్లో తిరుగుతున్న కనుక కొంచెం హూందాగా ఉంటే చాలు. వ్యాపారంలో ఉన్నప్పటి సంది మెట్రో షాపుల వెయ్యి, పన్నెండొందల చెప్పులు యేసుకుంటున్న. రేపు కూడా అవే యేసుకుంట. అన్యాయంగా వచ్చిన సొమ్ము ఒక్క రూపాయి కూడా నాకొద్దు’ అని చెప్పి పంపిన.