సీఎంను తీసుకొచ్చి ఆలయ రూపురేఖలు మారుస్తా
⇒రెండేళ్లలో అన్ని గ్రామాలకు వాటర్ ప్లాంట్లు
⇒అర్హులందరికీ ఫించన్లు వస్తాయ్
⇒ఎంపీ కడియం శ్రీహరి
జీడికల్(లింగాలఘణపురం) : మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయానికి వచ్చే నవంబర్‌లోగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆలయ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న జీడికల్ ఆలయ అభివృద్ధికి తనతో పాటు డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్యతో కలిసి చర్యలు తీసుకుంటానన్నారు.
రెండేళ్లలో మండలంలోని 17 గ్రామాలతోపాటు శివారు గ్రామాల్లో కూడా ఢీఫ్లోరైడ్ వాటర్ప్లాంట్లు ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మిస్తానని చెప్పారు. మొదటి విడతగా ప్రస్తుతం వాటర్‌ప్లాంట్‌లేని గ్రామాలకు మంజూరీ చేస్తానన్నారు. సమావేశంలో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్‌లు మదార్, సోమయ్య, మల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మధు, కృష్ణ, అంజయ్య, నాయకులు నాగరాజు, శ్రీనివాసు, పురుషోత్తంరెడ్డి, వీరస్వామి, ప్రభాకర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశం, రవి పాల్గొన్నారు.
విచారణ పూర్తి చేసి రెన్యూవల్ చేయండి
లింగాలఘణపురం : కళ్లెం సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ నిర్వహించి త్వరగా రైతులకు రుణాలు రెన్యూవల్ చేయాలని ఎంపీ కడియం శ్రీహరి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్(డీసీఓ) సంజీవరెడ్డిని ఆదేశించారు. శనివారం ఆయన జీడికల్ వీరాచల రామచంద్రుడిని దర్శించుకున్న అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వైస్ చైర్మన్ దర్శన్‌రెడ్డి సొసైటీ సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే డీసీఓతో ఫోన్లో మాట్లాడారు. సొసైటీలో విచారణ పూర్తి చేసి త్వరగా రుణాలు రెన్యూవల్స్ చేయాలని ఆదేశించారు. సోమవారం విచారణ అధికారిని పంపిస్తానని డీసీఓ చెప్పినట్లు ఎంపీ శ్రీహరి వైస్‌చైర్మన్‌కు తెలిపారు.