వైద్య హామీలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చండి
వైద్యాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి ఇచ్చిన హామీల అమలు ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలో వైద్యశాఖ బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రాధాన్యతలపై చర్చించారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి, మండలస్థాయిలో నలుగురు డాక్టర్లతో 30 పడకల ఆస్పత్రి వంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
‘ఇంటింటికీ ప్రభుత్వ వైద్యం’ నినాదం తో ముందుకు వెళుతున్నందున బడ్జెట్లో అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరినట్లు తెలిసింది. అధికార వర్గాల సమాచారం మేరకు సుమా రు రూ.7వేల కోట్లపై చిలుకు ప్రతిపాదనలు రూపొం దించారు. మరోవైపు వైద్య ముఖ్యకార్యదర్శి సురేష్ చందా గురువారం వైద్యశాఖ అధికారులతో ప్రత్యేకం గా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతోపాటు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు హాజరైన ఈ సమావేశంలో వైద్యశాఖ పనితీరుపై సమీక్షించారు.