అన్నివిధాలా ఆదుకుంటాం
బాధితులకు ఎల్జీ భరోసా
సహాయక చర్యలు ముమ్మరం చేసిన సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిప్రమాద బాధితులకు అన్ని రకాల తక్షణ సహాయం అదించాలని ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు ఎల్జీ భరోసా ఇచ్చారు. శుక్రవారం ఉదయం వసంత్‌కుంజ్ సమీపంలోని మసూద్పురా జుగ్గీజోపిడీలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎల్జీ సందర్శించారు.
ప్రమాద బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరఫున సహాయం అందుతుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే 35 ఫైర్ఇంజిన్లను సంఘటనా స్థలానికి పంపినట్టు డిప్యూటీ కమిషనర్ ఎల్జీకి వివరించారు.
క్షతగాత్రుల కోసం 12 అంబులెన్స్‌లను, వైద్య సిబ్బందిని హుటాహుటిన రప్పించినట్టు వారు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటల్లో చిక్కుకొని గాయపడిన ఎనిమిది మందిని దగ్గరలోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గుడిసెలు కాలిపోయి నిరాశ్రయులైన వారందరికీ తక్షణమే వసతి సదుపాయాలు కల్పించాలని ఎల్జీ ఆదేశించారు. సంఘటన స్థలానికి సమీపంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి, 24 గంటల పాటు వైద్య సహాయం అందించాలని చెప్పారు.
బాధితులకు మంచినీరు, ఆహార ప్యాకెట్లు సరఫరా చేయాలని సూచించారు. అవసరం మేరకు అదనపు సిబ్బందిని నియమించాలని డిప్యూటీ కమిషనర్‌కి చెప్పారు. క్షతగాత్రులందరికీ ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ఎల్జీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎల్జీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం వరకు సహాయ శిబిరాల వద్ద పది మంచినీటి ట్యాంకర్లు, ఎంసీడీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితులకు భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారులు సైతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.