విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి
జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి
మోమిన్‌పేట : పంచాయతీలలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపొయిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి వీధిదీపాలు, తాగు నీటి బోరు బావుల మోటార్లకు మీటర్లు లేవని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బిల్లులు ఇవ్వకుండా ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వేసి చెల్లించాల్సిందేనని పట్టుపట్టటడం ఎంతవరకు సమంజసమన్నారు.
పంచాయతీలకు వచ్చిన కేంద్ర 13వ అర్థిక సంఘం నిధుల నుంచి 80శాతం విద్యుత్ బిల్లుల కింద చెల్లిచాలని అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. 13వ అర్థిక సంఘం నిధులతో కేవలం తాగు నీటి వనరుల మరమ్మతుల కోరకు మాత్రమే వినియోగించాలని స్పష్టంగా చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లించాలని పేర్కొనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లిస్తే మరి తాగు నీటి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రభుత్వమే తెలపాలని ఆయన డిమాండు చేశారు. బకాయిలను ప్రభుత్వమే చెల్లించి ఇప్పటి నుంచి తాగు నీటి బోరు బావులు, వీధి దీపాలకు మీటర్లు బిగించాలని ఆయన కోరారు.
ప్రతి కనెక్షన్‌కు డీడీ రూపంలో విద్యుత్ శాఖకు చెల్లించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు రూ.50వేల నుంచి రూ.లక్షకుపైగా అవసరమవుతాయన్నారు. ఈ డబ్బును పంచాయతీలు ఏ నిధుల నుంచి చెల్లించాలో ప్రభుత్వమే తెలపాలన్నారు. చాలీచాలని నిధులతో పంచాయతీలు ఇప్పటికే కోట్టుమిట్టాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.