Deputy speaker election
-
పద్మారావుకు అన్ని పార్టీల మద్దతు
సాక్షి, హైదరాబాద్: శాసససభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను సోమవారం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. డిప్యూటీ స్పీకర్ నామినేషన్ల దాఖలు గడువు శనివారంతో ముగియగా, పద్మారావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. పద్మారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను కోరారు. ఆయన ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పద్మారావు నామినేషన్ దాఖలు ప్రక్రియలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు. -
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.. కేటీఆర్‌కు ఉత్తమ్ షరతు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు కాంగ్రెస్ మద్దతు కోరుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో భేటీ ముగిసింది. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతూనే.. ఓ షరతును పెట్టింది. ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇస్తామని, దానికి బదులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానానికి తమకు సహకరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం తమ తుది నిర్ణయాన్ని తెలుపుతానని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఐదు స్థానాలకు పోటీ చేయడంపై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకూ సంఖ్యా బలం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇదివరకే ప్రకటించారు. సంఖ్యా బలం లేకున్నా ఐదుగురిని నిలబెడుతామని సీఎం కేసీఆర్ ఎలా చెబుతారని భట్టి ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలలో కేసీఆర్ ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించారు. -
కేటీఆర్.. నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిశారు. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని ఉత్తమ్‌ని కేటీఆర్ కోరారు. వీరిద్దరి భేటీ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన ఫోన్‌నెంబర్‌ను ఎందుకు బ్లాక్ చేశారని ఉత్తమ్.. కేటీఆర్‌ను అడిగారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. మీ నెంబర్ నేను బ్లాక్ చెయ్యగలనా?.. నేను కేవలం మెసేజ్‌లు మాత్రమే చూస్తాను అని అన్నారు. కాగా ఏకగ్రీవం ఎన్నిక కోసం అంతకుముందే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. -
వైఎస్ జగన్ కు యనమల ఫోన్!
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల రామకృష్ణుడు ఫోన్ చేశారు. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని వైఎస్ జగన్ కు యనమల విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటి స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు ఈ సాయంత్రం ముగియనుంది. డిప్యూటి స్పీకర్ పదవికి మండలి బుద్ద ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో అతని ఎంపిక ఏకగ్రీవం కానుంది.